
హైదరాబాద్, వెలుగు: శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 ప్రముఖ శివాలయాలకు మూడు వేల ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప తదితర ఆలయాలకు ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పర్యాటక శాఖ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 26 నుంచి 27వ తేదీ వరకు స్పెషల్ బస్సు సర్వీసులు కొనసాగుతాయి. హైదరాబాద్ నుంచి వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, కీసర, కొమురవెల్లికి స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. అలాగే.. యాదగిరి గుట్ట, స్వర్ణగిరికి రోజూ ప్రత్యేక బస్సులు నడపాలని టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ సర్వీసును వచ్చే వారం నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. దీనికి టికెట్ల ధరను పెద్దలకు రూ.1,500, పిల్లలకు రూ.1200గా నిర్ణయించారు.
తమిళనాడులోని ప్రసిద్ధ శైవక్షేత్రం అరుణాచలానికీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 4 రోజులు సాగుతుంది. ఈ యాత్రలో అరుణాచలేశ్వర ఆలయంతో పాటు వేలూరు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం సందర్శన చేయిస్తారు. నెలలో ఒక్కసారే ఈ ప్యాకేజీ ఉంటుంది. మార్చి 11 నుంచి ఈ సర్వీసు ప్రారంభం అవుతుంది.