- ఎలక్ట్రిక్ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే.. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నదని తెలిపింది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నదని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తెలిపింది.హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పింది.
9 డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు
2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 550 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులకు, 500 సిటీ బస్సులకు సొంత టెండర్ ద్వారా ఆర్డర్ ఇచ్చారు. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన బస్సులు ఈ ఏడాది మే వరకు సంస్థకు అందజేస్తామని ప్రైవేట్ సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లోని ఆరు డిపోలతో పాటు వరంగల్లో 2, కరీంనగర్లో 2, నిజామాబాద్లో -2 డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ వివరించింది. ఎలక్ట్రిక్ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదని వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే కిలోమీటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను సంస్థ గుర్తిస్తుంది. ప్రైవేట్ అద్దె బస్సుల మాదిరిగానే ఎలక్ట్రిక్ బస్సులన్నీ టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయని యాజమాన్యం పేర్కొంది.
ఇప్పటివరకు 2500 కొత్త బస్సులు కొన్నం
సంస్థలో కొత్త బస్సులను కొనుగోలు చేయడం లేదనడంలో వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2500 కొత్త బస్సులను ప్రజలకు సంస్థ అందుబాటులోకి తెచ్చామని వెల్లడించింది. ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడం లేదనడం కూడా అవాస్తవమని, ఖాళీగా ఉన్న 3038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని వివరించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పింది. ఆ కమిటీ తన నివేదికను ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సిబ్బందికి, ప్రజలకు ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది.