TGSRTC గుడ్ న్యూస్: ఇంటికే కార్గో సేవలు.. హోమ్ డెలివరీ ప్రారంభం.. ఎప్పటినుంచి అంటే

TGSRTC గుడ్ న్యూస్:  ఇంటికే కార్గో సేవలు.. హోమ్ డెలివరీ ప్రారంభం.. ఎప్పటినుంచి అంటే
  • ఇక ఇంటికే..కార్గో సేవలు
  • అక్టోబర్ 27  నుంచి హోమ్ డెలివరీ 
  • పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ లో ప్రారంభం
  • గ్రేటర్ పరిధిలో 31 కౌంటర్ల ద్వారా సేవలు 
  • ఫ్రాంచైజీల ద్వారా మరో 102 కౌంటర్లు ఏర్పాటు  

హైదరాబాద్​సిటీ, వెలుగు: కార్గో సేవలను ఇకపై ఇంటి వద్దకే అందించనున్నట్టు ఆర్టీసీ తెలిపింది. ఆదివారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో హోమ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఇకపై వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే పార్సిళ్లను నేరుగా ఇంటి వద్దకే వచ్చి డెలివరీ చేయనున్నట్టు వెల్లడించింది. ‘‘ఆర్టీసీ కార్గో సేవలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే పైలట్ ప్రాజెక్టుగా గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో డోర్​డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నం. కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, మేడ్చల్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్​బీ నగర్.. ​ఇలా మొత్తం 31 ప్రధాన కేంద్రాల ద్వారా డోర్​డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నం. అలాగే ఫ్రాంచైజీల ద్వారా ఏజెంట్లను కూడా నియమించాం. వీరి ద్వారా మరో 102 కేంద్రాల నుంచి కూడా డోర్​డెలివరీ సదుపాయం ఉంటుంది” అని ఆర్టీసీ అధికారులు శనివారం తెలిపారు. లాజిస్టిక్ సేవలు ప్రారంభించిన నాటి నుంచే ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఈ నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ప్రైవేట్ లాజిస్టిక్ కంపెనీలకు దీటుగా ఆర్టీసీ సేవలందిస్తున్నదని పేర్కొన్నారు. 

హోమ్ డెలివ‌‌‌‌రీ చార్జీలివీ.. 

  • ఒక  కేజీ వరకు  పార్సిల్... రూ.50
  • కేజీ నుంచి 5 కిలోల వరకు.......రూ.60
  • 5 కిలోల నుంచి  10 కిలోల వరకు...రూ.65
  • 10 కిలోల నుంచి  20 కిలోల వరకు....రూ.70
  • 20కి లోల నుంచి  30 కిలోల వరకు .....రూ.75

(30 కిలోలు దాటితే పైన పేర్కొన్న  స్లాబ్‌‌‌‌ల ఆధారంగా ధ‌‌ర‌‌లు ఉంటాయి)