హైదరాబాద్,వెలుగు: బస్‌డిపోలను ప్రైవేటీకరణ చేస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సంస్థ వెల్లడించింది.
బస్సుల మెయింటెనెన్స్, చార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోందని వివరించింది. కేంద్రప్రభుత్వ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్)-1 స్కీమ్‌లో భాగం గా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఇదే విధానంలో ప్రవేశ పెట్టడం జరిగింది. ఒలెక్ట్రా కంపెనీతో ఒప్పందం చేసుకుని పుష్ఫక్ పేరుతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది.