బస్సు చార్జీలు పెంచలేదు...టీజీఎస్ఆర్టీసీ

బస్సు చార్జీలు పెంచలేదు...టీజీఎస్ఆర్టీసీ
  • తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బస్సు చార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)  స్పష్టం చేసింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయని తెలిపింది. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని.. ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సంస్థ సవరించిందని వెల్లడించింది. ఈ సవరించిన టోల్ సెస్ కూడా ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపింది.

టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ ను యాజమాన్యం సవరించిందని చెప్పింది.  సాధారణ రూట్లలో టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని క్లారిటీ ఇచ్చింది.  బస్ చార్జీలను పెంచినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీఎస్ ఆర్టీసీ హెచ్చరించింది.