ఆర్టీసీ సీసీఎస్ నిధులు ఖాళీ

ఆర్టీసీ సీసీఎస్ నిధులు ఖాళీ
  • ఆర్టీసీ యాజమాన్యం తీరుతో ఉద్యోగుల్లో ఆందోళన 
  • వాడుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్
  • రుణాలు అందక ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన​
  • హైకోర్టును ఆశ్రయించాలనే యోచనలో సీసీఎస్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సహకార పరపతి సంఘం(సీసీఎస్) దివాళా దశకు చేరుకున్నది. ఉద్యోగుల వేతనాల నుంచి 7% డబ్బులు నెల వారీగా సీసీఎస్‌‌కు జమ చేస్తూ ఉంటారు. ఆ నిధుల్లోంచి తక్కువ వడ్డీకే ఉద్యోగులకు రుణాలు ఇస్తారు. గతంలో సుమారు రూ.3 వేల కోట్ల నిధులతో  ఉన్న సీసీఎస్ ఖజానా ఇప్పుడు దాదాపు ఖాళీ అయిపోయింది. ఫలితంగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు డబ్బులు అందడం లేదు. దాంతో ఉద్యోగులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా వాడుకున్న సొమ్మును వెంటనే సీసీఎస్ కు చెల్లించాలనే ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్​చేస్తున్నారు. 

అవసరాలకు వాడుకున్న యాజమాన్యం

ఆర్టీసీలో సుమారు 40 వేల వరకు ఉద్యోగులు ఉన్నారు. వారికి ఆర్థికపరంగా ఏ అవసరం వచ్చినా సీసీఎస్ ఆదుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న టైంలో  ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్ నిధులను వాడుకుంది. ఏండ్లు గడుస్తున్నా ఖర్చు చేసిననిధులను తిరిగి సీసీఎస్ లో జమ చేయలేదు. దాంతో ఉద్యోగులకు సీసీఎస్ రుణాలు అందడం లేదు. తమ సంస్థ నిధులను ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని తిరిగి చెల్లించడం లేదని గతంలో సీసీఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వాడుకున్న నిధులను వెంటనే సీసీఎస్ కు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం గత ఏడాది సుమారు రూ. 350 కోట్ల వరకు సర్దుబాటు చేసింది. కొందరు ఉద్యోగులకు సీసీఎస్ రుణాలు అందాయి. 

5 వేల మంది ఎదురుచూపులు

పలు కారణాల వల్ల ఇప్పుడు మళ్లీ సీసీఎస్ లో నిధులు ఖాళీ అయ్యాయి. ఈ సంస్థ ద్వారా రుణాలు  పొందేందుకు దరఖాస్తు చేసుకున్న సుమారు ఐదు వేలకు పైగా ఉద్యోగులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ జీతం నుంచి 7 శాతం కోత పెట్టుకొని నిధిని ఏర్పాటు చేసుకుంటే..  ఇప్పుడు తమ అవసరాలకే  సంఘం రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర బకాయిల  చెల్లింపులు రిటైర్మెంట్ అయిన వారి అవసరాలకే సరిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. తమకు ఇప్పట్లో  రుణాలు వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. సంస్థకు బకాయి పడ్డ మొత్తం నిధులను ఆర్టీసీ యాజమాన్యం చెల్లిస్తేనే తమకు ఊరట అని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ యాజమాన్యంపై సీసీఎస్ ఒత్తిడి పెంచుతోంది. కోర్టు ధిక్కరణ కింద ఆర్టీసీకి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడమా..లేక ప్రత్యక్ష ఆందోళనలకు దిగడమా అనే ఆలోచనలో సీసీఎస్ సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది.