దసరా పండగ వేళ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్

దసరా పండగ వేళ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ సందడి నెలకొంది. పండగ సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లను కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల సామర్ధ్యానికి తగ్గ సంఖ్యలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 6304 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

 దసరా పండగ సందర్భంగా పోలీస్, రవాణా శాఖల అధికారులతో ఇవాళ ఆర్టీసీ (అక్టోబర్ 7) సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు నేప‌థ్యంతో ర‌ద్దీ దృష్ట్యా గ‌త ఏడాదితో పోల్చితే అద‌నంగా 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను తిప్పాల‌ని నిర్ణయించామని పేర్కొన్నారు.

ALSO READ | ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ

ఈ నెల 9 నుంచి 12 తేది వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‎లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్‎లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుదని.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‎లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియ‌మించామని చెప్పారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లనూ నియ‌మించామన్నారు.