హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం జరగనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సు–లు నడపాలని క్షేత్రస్థాయి ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే బస్సులు నడుపుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో ‘మే ఐ హెల్ప్ యూ’ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో గైడ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4. 03 లక్షల మంది అభ్య ర్థులు గ్రూప్–1 ప్రిమిలినరీకి హాజరవుతుండగా గ్రేటర్హైదరాబాద్లోనే దాదాపు 1.70లక్షల మంది పరీక్ష రాస్తున్నారు.