ఆర్టీసీ సమ్మె సైరన్.. మే 7 నుంచి బస్సులు బంద్

ఆర్టీసీ సమ్మె సైరన్.. మే 7 నుంచి బస్సులు బంద్

తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది.  మే 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు.  ఆర్టీసీ సమ్మె పై నారాయణగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కార్మిక సంఘాలు సమ్మె వాల్ పోస్టర్ ను  రిలీజ్ చేశారు.  

ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్  ఈదురు వెంకన్న... మే డే స్పూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్దమైనం.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలి. మా న్యాయమైన డిమాండ్ ల పై స్పందించాలి.  సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు మే5 న కార్మిక కవాతు చేపడుతున్నాం.  ఆర్టిసి కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ యూనిఫారంలో  కవాతు ఉంటుంది.  

మే 7 నుంచి  ఆర్టీసీ కార్మికులు సమ్మె కు వెళ్ళబోతున్నం.  కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జెఏసిలోకి వస్తామని, మళ్లీ యాజమాన్యాలకు మద్దతుగా మాతో కలవడం లేదు . యూనియన్ లకు అతీతంగా అందరు సమ్మెకు కలిసి రావాలి. సీఎం త్వరగా ఆర్టీసీ విలీనాన్ని చేపట్టాలి.  ఆర్టీసీలో ప్రజాపాలన చేయాలని కోరుతున్నాం.  ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొని నడపాలి.  2021 వేతన సవరణ చేయాలి, పెండింగ్ బకాయిలు చెల్లించాలి.  ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ చేపట్టాలి.  16 వేల మంది రిటైర్ అయిన ఖాళీలను భర్తీ చేయాలి.  సీఎం వెంటనే ఆర్టీసీలో నెలకొన్న  సమస్యల పై తమ వైఖరి తెలపాలి అని డిమాండ్ చేశారు. 

సమ్మె ఆగదు: ఆర్టీసీ జెఏసి వైస్ చైర్మన్  థామస్ రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మే 7 న సమ్మె కు వెళ్తున్నాం.  ఇప్పటికే లేబర్ కమిషన్ కు సమ్మె పై  లేటర్ ఇచ్చాం.   ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7వ తేది నుంచి సమ్మె జరుగుతుంది. సీఎం ఆర్టీసీ పై మీ వైఖరి చెప్పండి, మా సమస్యలను పరిష్కరించండి.  చిత్త శుద్ది ఉంటే మిగతా అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి . ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు, ప్రై వెట్ బస్సులను నడపొద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసి ఉద్యోగులకిచ్చిన హామీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలి.  సంస్థలో పారిశ్రామిక అశాంతి కలగకుండా చూడాలని జేఏసీకోరుతోంది. 

►ALSO READ | ఆర్మీకోసం విరాళాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు..తెలంగాణ పోలీస్ కీలక ప్రకటన