- డిస్పెన్సరీల్లో మెరుగైన సౌలతుల కల్పనకు కసరత్తు!
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల హెల్త్ కేర్ పై సంస్థ యాజమాన్యం దృష్టి పెట్టింది. డిస్పెన్సరీల్లో మెరుగైన సౌలతులు కల్పించేందుకు రెడీ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు మొత్తం 14 డిస్పెన్సరీలు ఉన్నాయి. అందులో సిటీలోనే 4 ఉన్నాయి. మిగతా 10 డిస్పెన్సరీలు పది ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. అయితే, జిల్లా కేంద్రాల్లో ఉన్న డిస్పెన్సరీల్లో ఇప్పటి వరకు తగినంత వైద్య సిబ్బంది లేకపోవడం, కొన్ని చోట్ల వైద్యులే లేకపోవడం, ఇంకొన్ని చోట్ల మందుల కొరత ఉండడం, వేరే కొన్నింటిలో సరైన వసతులు లేవు.
దాంతో ఆర్టీసీ ఉద్యోగులు ఏ చిన్న వైద్యం చేయించుకోవాలన్నా హైదరాబాద్కు రావాల్సి వస్తున్నది. తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రికి ఆర్టీసీ ఉద్యోగులంతా క్యూ కడుతున్నారు. దీంతో ఇక్కడ పని చేసే డాక్టర్లు, ఉద్యోగులపై పని ఒత్తిడి తీవ్రమవుతోంది. దీన్ని గుర్తించిన సంస్థ యాజమాన్యం.. ముఖ్యమైన సర్జీలు వంటివి మినహా మిగితా అన్ని రకాల వైద్య సేవలు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని సంస్థ డిస్పెన్సరీలలోనే ఆర్టీసీ ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా ఆధునీకరించడంపై కసరత్తు చేస్తున్నది.