
రోడ్డు మీద వంద రూపాయల నోటు కనబడితేనే.. అటు, ఇటు చూసి ఎవరూ చూడకుండా జేబులో వేసుకునే జనం ఉన్న ఈరోజుల్లో.. ఏకంగా రూ. 13 లక్షల విలువజేసే బంగారు నగలు ఉన్న బ్యాగు దొరికితే.. దాని యజమానికి అందజేసి.. మానవత్వం చాటుకున్నాడు ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి... శనివారం ( ఏప్రిల్ 26 అచ్చంపేట-హైదరాబాద్ రూట్ టీజీఎస్ఆర్టీసీ బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు వంకటేశ్వర్లు.
అచ్చంపేటలో బయలుదేరిన బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ కు చేరుకుంది.. బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తన బ్యాగు మరిచిపోయినట్లు గుర్తించాడు కండక్టర్. అందులో బంగారు, వెండి నగలతో పాటు కొంత నగదు కూడా ఉన్నట్లు గుర్తించిన కండక్టర్... వెంటనే ఈ విషయాన్ని అచ్చంపేట డీఎం మురళీ దుర్గా ప్రసాద్ కు ఫోన్ లో సమాచారం అందించగా.. బ్యాగ్ ను ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని డీఎం సూచించారు.
ఇంతలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డీఎంకి ఫోన్ చేసి బస్సులో బ్యాగును మరచిపోయినట్లు చెప్పారు. కందుకూర్ లో బస్సు ఎక్కి సీబీఎస్ లో దిగి కాచిగూడకు వెళ్లిపోయానని పేర్కొన్నారు ప్రయాణికుడు. ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలని అతనికి సూచించారు డీఎం. టీజీఎస్ఆర్టిసీ అధికారులు వివరాలను పరిశీలించి.. బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్ కు అందజేశారు. అందులో 14 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.14,800 నగదు, తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్, తన విద్యార్హత ధ్రువపత్రాలు ఉన్నాయని తెలిపారు ప్రయాణికుడు.
విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.13 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసిన కండక్టర్ వెంకటేశ్వర్లును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ అభినందించారు.