- మన్ కీ బాత్‌లో సజ్జనార్ ఎక్స్ ఖాతాలోని వీడియో పంచుకున్న మోదీ
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ధన్యవాదాలు చెప్పారు. డిజిటల్ మోసాలపై అవగాహన కోసం తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ లో పంచుకోవడంతో కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో పేర్కొన్నారు.
అందులో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను మోదీ పంచుకున్నారు. కర్నాటక విజయపూర్‌కు చెందిన సందీప్ పాటిల్‌ను నకిలీ పోలీసు బోల్తా కొట్టించబోయారు. నకిలీ పోలీసుతో పాటిల్ మాట్లాడుతున్న వీడియోను సజ్జనార్ తన ‘ఎక్స్’ ఖాతాలో సెప్టెంబర్ 19న పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఆధారంగా.. సంతోష్ పాటిల్ ధైర్యాన్ని ప్రధాని మెచ్చుకున్నారని సజ్జనార్ చెప్పారు.