సంక్రాంతి స్పెషల్ బస్సులు బయల్దేరబోతున్నాయ్.. హైదరాబాద్లో ఈ ఏరియాల నుంచే..

హైదరాబాద్: సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ స‌న్నద్ధమైంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్య స్థానాల‌కు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి పండుగ‌కు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. అందుకే ఆ రోజుల్లో ప్రయాణికుల ర‌ద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. 

అలాగే.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లు వెళ్లిన వాళ్లు హైదరాబాద్కు ఈ నెల 19, 20 తేదీల్లో తిరిగి వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన విధంగా కూడా బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

సంక్రాంతి పండుగ‌కు న‌డిపే ప్రత్యేక బ‌స్సుల‌కు రాష్ట్ర ప్రభుత్వ  జీవో ప్రకారం టికెట్ ధ‌ర‌లను స్వల్పంగా పెంచుకునేలా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స‌వ‌రించింది. తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 10, 11, 12 తేదీల‌తో పాటు తిరుగు ప్రయాణ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే 19, 20 తేదీల్లో మాత్రమే స‌వ‌రించిన చార్జీలు అమ‌ల్లో ఉంటాయి.

ALSO READ | రేపు ( జనవరి 10 ) తిరుపతికి సీఎం రేవంత్‌రెడ్డి..

స్పెష‌ల్ బ‌స్సుల మిన‌హా రెగ్యుల‌ర్ బ‌స్సుల్లో సాధార‌ణ ఛార్జీలే అమ‌ల్లో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం య‌ధావిధిగా అమల్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవ‌లం 5 రోజులు పాటు టికెట్ ధ‌ర‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ స‌వ‌రించింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ను www.tgsrtcbus.in వెబ్సైట్లో చేసుకోవచ్చు.