హైదరాబాద్ సిటీ, వెలుగు: సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల కోసం సిటీలో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ఏరియాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నది. ఆయా ప్రాంతాల్లో పండల్స్, టెంట్లు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసింది.
ఈసారి పండగకు రాష్ట్ర వ్యాప్తంగా 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో మెజారిటీ బస్సులు సిటీ నుంచే నడపనున్నది. ఈ నెల 10, 11,12 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 19, 20 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆ టైంలో స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. www.tgsrtcbus.in వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవాలని సంస్థ సూచించింది. పూర్తి సమాచారం కోసం 040-69440000, 040-23450033 నంబర్లు సంప్రదించాలని తెలిపింది.