కార్తీకమాసంలో శివాలయాలకు RTC స్పెషల్ బస్సులు.. వివరాలివే

కార్తీకమాసంలో శివాలయాలకు RTC స్పెషల్ బస్సులు.. వివరాలివే

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ శైవ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. కార్తీక మాసం సందర్భంగా  శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనుంది. అరుణాచ‌లం, పంచారామాల‌కు స్పెషల్ ప్యాకేజీలతో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీ ప‌నితీరుపై ఉన్నత‌స్థాయి స‌మీక్షా స‌మావేశం ఏర్పాటు చేశారు. ప‌విత్రమైన కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల‌కు భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జనార్ తెలిపారు. 

శ్రీశైలం, వేముల‌వాడ, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌,  మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం, త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి శ‌నివారం వ‌ర్చ్‌వ‌ల్‌గా ఉన్నత‌స్థాయి స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వహించారు ఎండీ వీసీ స‌జ్జనార్. ఆర్టీసీకి కార్తీక మాసం, శ‌బ‌రిమ‌ల ఆప‌రేష‌న్స్ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని అరుణాచ‌లానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.