రాఖీ పండుగ రోజు టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్నారు మహిళా కండక్టర్ . తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగానే వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
గద్వాల డిపోకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో ఆగస్టు 19న ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
కండక్టర్ కు మంత్రి,ఆర్టీసీ యాజమాన్యం అభినందనలు
టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్భిణికి పురుడు పోసిన వనపర్తి డిపోకు చెందిన మహిళా కండక్టర్ జి.భారతికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే సేవాతర్పరతను చాటుతుండటం అభినందనీయన్నారు.
మరో వైపు కండక్టర్ భారతికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా అభినందనలు తెలిపింది. సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయని ట్వీట్ చేసింది టీజీఎస్ఆర్టీసీ