హైవేలపై 74 ట్రామాకేర్ సెంటర్లు

  •  మూడు దశల్లో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం
  • సెంటర్ల ఏర్పాటు, నిర్వహణకురూ. 1,100 కోట్లు 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని నేషనల్, స్టేట్ హైవేలపై 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్ల ఏర్పాటు, ఐదేండ్ల పాటు నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,100 కోట్లను ఖర్చు చేయనుంది. మొత్తం ట్రామా కేర్ సెంటర్లను మూడు దశల్లో నిర్మించనున్నారు. తొలి దశలో 24, రెండో దశలో 24, మూడో దశలో 26 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

 తొలి దశ 24 సెంటర్లను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి, రెండో దశ 24 సెంటర్లను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో రోజుకు సగటున 425 ట్రామా కేసులు నమోదవుతున్నాయని, ఇందులో రోడ్డు యాక్సిడెంట్ కేసులు 59 శాతం, ఇతర కేసులు 41 శాతం ఉంటున్నట్టు అధికారుల పరిశోధనలో తేలింది. 

ఎమర్జెన్సీలో పేషెంట్లను సకాలంలో దవాఖాన్లకు చేర్చి వారి ప్రాణాలు పోకుండా కాపాడడం కోసం ట్రామా కేర్ సెంటర్లు తప్పనిసరి అని నివేదికలో పేర్కొన్నారు. తమిళనాడు తరహాలో ట్రామా కేర్ సెంటర్లను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

 ప్రైవేటు హాస్పిటళ్లు, ప్రభుత్వ ట్రామాకేర్ సెంటర్లు, దవాఖాన్లలో ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్లకు రూ.లక్ష వరకూ ఉచితంగా చికిత్స అందజేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి తల్లి(తెలంగాణ హైవే యాక్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లేదా టెల్ మీ(తెలంగాణ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అనే పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.