
బ్యాంకాక్: సైనైడ్ ఇచ్చి14 మందిని హతమార్చిన థాయ్ లాండ్ మహిళకు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. గ్యాంబ్లింగ్‌కు బానిసై తరచూ స్నేహితుల వద్ద అప్పులు చేసి ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని అడిగినవారిని సైనైడ్ ఇచ్చి చంపేసింది. సిరిపర్న్ ఖన్వాంగ్ అనే మహిళ హత్య కేసు విచారణలో భాగంగా సారరట్ రంగ్ సివుతాపర్న్ చేసిన దారుణ చర్య వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్‌కు బానిసైన థాయ్ మహిళ సారరట్ రంగ్ సివుతాపర్న్ స్నేహితుల వద్ద 3 లక్షల బాత్ లను అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత డబ్బులను అడిగిన వారికి ఎవరికీ అనుమానం రాకుండా సైనైడ్ ఇచ్చి చంపేసింది. అనంతరం మృతుల ఇండ్లల్లో ఉండే నగలు, విలువైన వస్తువులను దోచుకునేది. ఇలాగే ఖన్వాంగ్ను కూడా చంపేసింది. అయితే, పోలీసుల విచారణలో దొరికిపోయింది. దీంతో 2015లో జరిగిన ఇలాంటి హత్య కేసులను తిరగదోడగా.. సారరట్ మొత్తం 14 హత్యలు చేసినట్లు తేలింది.