వీడియో: అరుదైన ఘనత సాధించిన మహిళా బౌలర్.. 4 బంతుల్లో 4 వికెట్లు

వీడియో: అరుదైన ఘనత సాధించిన మహిళా బౌలర్.. 4 బంతుల్లో 4 వికెట్లు

తమకంటూ గుర్తింపు రావటానికి, తమ నైపుణ్యాన్ని బయటపెట్టడానికి మేటి జట్లలో ఉండక్కర్లేదు.. మేటి జట్లతో అడక్కర్లేదని నిరూపించింది.. ఓ అసోసియేట్ దేశపు మహిళా క్రికెటర్. ఏకంగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి తన పేరును ప్రపంచానికి ఘనంగా తెలియజేసింది. 

ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్ పేరు.. తిప్చా పుట్టావాంగ్. పసికూన జట్టుగా భావించే థాయ్‌లాండ్ క్రీడాకారిణి. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆమె ఈ అరుదైన ఘనత సాధించింది. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. మొత్తంగా 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన తిప్చా పుట్టావాంగ్.. 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో మహిళా క్రికెటర్‌ కాగా, ఓవరాల్‌గా ఏడో క్రికెటర్‌.

ఇలా 4 బంతుల్లో 4 వికెట్లు తీయ‌డాన్ని డ‌బుల్ హ్యాట్రిక్ అంటారు. పురుషల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం లసిత్‌ మలింగా, అఫ్ఘాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్, ఐర్లాండ్ ఫాస్ట్ బౌల‌ర్ క‌ర్టిస్ కాంఫ‌ర్‌, వెస్టిండీస్‌ బౌలర్‌ జాసన్‌ హోల్డర్‌ ఉన్నారు. ఇక మహిళా క్రికెటర్లలో జర్మనీ స్పిన్నర్‌ అనురాధ దొడ్డబల్లాపూర్, బోట్స్వానా బౌలర్‌ షమీలా మోస్వీ ఈ ఘనత సాధించారు.