- తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సూర్యాపేట, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని, ఆ తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా వర్గీకరణకు చట్టబద్ధత వచ్చిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రిజర్వేషన్ల ఫలితాలు అన్ని వర్గాలకు దక్కాలంటే బీసీల్లో కూడా వర్గీకరణ చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం మంచిదేనని, అయితే రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. అలాగే నాలుగు బ్యాంకులలో లోన్లు తీసుకుంటే ఒక్క బ్యాంకులో మాత్రమే మాఫీ చేస్తామనడం కరెక్ట్ కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా కొన్ని హామీలు మాత్రమే అమలు చేసిందని, మిగతా వాటిని కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ పరిధిలోని లిఫ్ట్‌ల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.