ఆన్​లైన్​ యుగంలో ఈ ఓటింగ్ సురక్షితమే!

సోషల్ మీడియాలో సందేశాలు పంపడం, యూపీఐ నెట్ బ్యాంకింగ్ వినియోగం, ఆన్‌‌లైన్ కొనుగోలు చెల్లింపులు, ఉద్యోగ పోటీ పరీక్షల దరఖాస్తులు నింపడం తదితర ఆన్‌‌లైన్ సేవల వినియోగంలో బాలల నుంచి పెద్దల వరకు అందరూ నైపుణ్యం సంపాదిస్తున్నారు. మరోవైపు ప్రతి రంగంలో టెక్నాలజీ వినియోగం పెరిగి కృత్రిమ మేధా, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ రూపీ దిశగా దేశం అడుగులేస్తున్న వేళ, చంద్రయాన్, మంగళయాన్ మిషన్లు పంపుతున్న నేటి ఆధునిక కాలంలో కూడా ఇంకా కాలం చెల్లిన పేపర్ బ్యాలెట్ ఈవీఎంలను ఎన్నికల్లో వినియోగిస్తున్న విధానం విమర్శలకు దారితీస్తోంది. రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచన విధానాన్ని సమర్థిస్తున్నట్టుగా భారత ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ లేదా ఇంటర్నెట్ ఓటింగ్ ప్రవేశపెట్టడంలో నిష్క్రియా పరంగా వ్యవహరిస్తున్నది.

అప్పట్లో కుండలే బ్యాలెట్లు..

ప్రాచీన గ్రీస్‌‌లో ‘ఓస్టాక్కా’ అనే విరిగిన కుండ పెంకుల పై పేర్లు రాసి  ప్రజలు  ప్రతినిధులను ఎంపిక చేసేవారు. ఇటలీ వెనీస్‌‌లో ‘బ్యాలెట్’ అనే నలుపు తెలుపు బంతుల ద్వారా పాలకులను ఎన్నుకునేవారు సాధారణ శకం 920 నాటికి తమిళనాడులో గ్రామ అసెంబ్లీ ఎన్నికలలో ‘తాటి ఆకుల’ పై పేర్లు రాసి కుండలో వేసి ఎన్నుకునే పద్ధతి ఉండేది. ఆధునిక కాలంలోని 167 ప్రజాస్వామ్య దేశాలలో 20 దేశాలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వాడుతుండగా మిగిలిన 147 దేశాలలో పేపర్ బ్యాలెట్‌‌లను వినియోగిస్తున్నారు. ఈవీఎంలను 1982 కేరళలోని ఉత్తర పరవూరు నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగానూ 2003లో అన్ని రాష్ట్రాల ఎన్నికలు, 2004లో లోక్‌‌సభ ఎన్నికలలో పూర్తిగా ఉపయోగించారు.

14 దేశాల్లో అమలవుతున్న ఈ ఓటింగ్‌‌..

2019లో జరిగిన 17వ సాధారణ ఎన్నికలలో 912 మిలియన్ల ఓటర్లలో 67% మంది ఓటర్లే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇంకా 33% ఓటర్లు ఓటింగ్ ప్రక్రియ పట్ల నిరాశక్తంగా ఉన్నారు. వీరి గైర్హాజరుకు అనేక కారణాలు ఉండవచ్చు అనారోగ్యం, చేసే పని, పేదరికం, వృద్ధాప్యం, వలసలు, ఆసక్తి లేకపోవడం, ఆన్‌‌లైన్‌‌ ఓటింగ్ సదుపాయం లేకపోవడం  కూడా కారణం కావచ్చు. ఆన్‌‌లైన్‌‌ ఈ ఓటింగ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చి 14 దేశాలలో అమలవుతోంది. ఇది ఒక సమర్థవంతమైన ఓటింగ్ విధానం. తమ మొబైల్ లేదా డెస్క్ టాప్, కంప్యూటర్ లాప్ టాప్​, టాబ్ ద్వారా ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఓటు వేయవచ్చు. ఈ వెబ్ ఆధారిత ఓటింగ్ విధానం భద్రత, కచ్చితత్వం, వేగం, గోప్యత, ఆడిటబిలిటీ, యాక్సెసబిలిటీ, తక్కువ ఖర్చు, పర్యావరణ అనుకూలమైంది. మన ఫోన్‌‌కు వచ్చిన ఎస్ఎంఎస్  లింక్ లేదా ఈమెయిల్ లింక్‌‌ను క్లిక్ చేసి నేరుగా ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. ఓటింగ్ డేకు ముందు వారం రోజుల నుంచి ఓటు వేయవచ్చు. ఎన్నిసార్లు అయినా ప్రాధాన్యత మార్చుకోవచ్చు. చివరకు ఓటింగ్ రోజు వీలైతే పోలింగ్ బూత్‌‌కు వెళ్లి ప్రత్యక్షంగా కూడా ఓటు వేయొచ్చు. అప్పుడు ఆన్‌‌లైన్ ద్వారా వేసిన ఓటు తొలగిపోతుంది. మన ఓటు సరైన అభ్యర్థికే పడిందా లేదా అని స్క్రీన్ పై వెరిఫై చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. 2021 అక్టోబర్‌‌‌‌లో ఖమ్మంలో నిర్వహించిన డ్రై రన్ ఓటింగ్‌‌లో ఈ ఓట్ యాప్ ద్వారా ఆధార్ మ్యాచింగ్ ఓటరును గుర్తించడం, డేటా బేస్‌‌ మ్యాచింగ్‌‌తో సొంత ఫోన్ ఐడి నెంబర్ ఆధారంగా ఓటు వేసేలా చేశారు.

2024 ఎన్నికల్లో

నూతన టెక్నాలజీని వినియోగించే క్రమంలో అపోహలు, ఇబ్బందులు రావడం సహజమే. ఈవీఎం సమస్యను అధిగమించడానికి వీవీపాట్‌‌ అమర్చినట్టుగా సమర్థవంతమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ, హ్యాకింగ్‌‌కు ఆస్కారం లేని బ్యాంకింగ్ సాఫ్ట్‌‌వేర్లను వాడటం ద్వారా ఓటును సురక్షితంగా ప్రసారం చేసి భద్రపరచవచ్చు.  అందువల్ల 2024 సాధారణ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా సర్వీసు ఓటర్లు, విదేశాల్లో ఉన్న ఓటర్లు, వికలాంగులు, వృద్ధులు, డ్యూటీలో ఉండే ఉద్యోగులకు ఈ ఓటింగ్ అవకాశం కల్పించాలి. మానవ జీవన విధానంలో అన్ని పార్శ్వాలలో వాడుతున్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓటింగ్‌‌లో ఎందుకు వాడకూడదు?

నమ్మకం లేని ఆన్‌‌లైన్‌‌ ఓటింగ్‌‌..

ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని 2007 నుండి సమర్థవంతంగా ఉపయోగిస్తున్న దేశం ఎస్తోనియా. 2007లో 30 వేల 275 మంది అనగా మొత్తం దేశ ఓటర్లలో 3.4% ఈ దేశంలో ఆన్‌‌లైన్‌‌ ద్వారా ఓటు చేయగా 2011లో 1,40, 846 మంది    (24.3%) 2015లో 1,76 వేల 491 మంది (30.5%), 2019లో 2,47,232 (43.8% )ఈ దేశంలో ఆన్‌‌లైన్ ఓటు వేశారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికలు, కెనడా మునిసిపల్ ఎన్నికలు, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక ఎన్నికలు ఈ పద్ధతిలో జరుగుతున్నాయి.  ఈ ఓటింగ్ విధానంలోని భద్రతను చాలామంది ప్రశ్నిస్తున్నారు. పెగాసెస్‌‌ లాంటి స్పై సాఫ్ట్‌‌వేర్లు, హ్యాకర్లు, ఆన్‌‌లైన్ మోసాలు పెరిగిన నేటి కాలంలో సర్వర్లలో మాల్వేరును చొప్పించి ఓటును మార్చవచ్చునని.. మొత్తం ఫలితాల డేటాను తారుమారు చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటు ప్రసారం లేని ఈవీఎంలపై నమ్మకం లేక ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాలు నిలిపివేశాయి. అందువల్ల ట్యాంపరింగ్‌‌కు అవ కాశం ఉండే ఇంటర్నెట్ ఓటింగ్‌‌ను నమ్మలేమని కొందరు వాదిస్తున్నారు. పైగా అధిక ఖర్చు, ఎక్కువ సర్వర్లు అవసరం ఉండటం, స్మార్ట్ ఫోన్ లేనివారు ఉపయోగించుకోలేకపోవడం వల్ల డిజి టల్ డివైడ్ పెరిగే అవకాశం, హ్యాకింగ్‌‌ను గుర్తించలేకపోవడం తదితర కారణాలవల్ల ఈ విధానం సురక్షితం కాదని కొందరు వాదిస్తున్నారు. - తండ ప్రభాకర్ గౌడ్, ప్రధానోపాధ్యాయుడు, మహబూబాబాద్​ జిల్లా