Thandel: ‘తండేల్’ పబ్లిక్ టాక్.. ఓవర్సీస్లో సినిమా చూసి ఇలా అంటున్నారంటే..

Thandel: ‘తండేల్’ పబ్లిక్ టాక్.. ఓవర్సీస్లో సినిమా చూసి ఇలా అంటున్నారంటే..

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ఓవర్సీస్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా చూసిన ఓవర్సీస్ రివ్యూయర్లు, ప్రేక్షకులు ‘తండేల్’ సినిమా చూశాక తమ అభిప్రాయాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. సాయిపల్లవి నటనకు మరోసారి ప్రేక్షకులు ‘ఫిదా’ అవడం పక్కా అని, నాగచైతన్య కమ్ బ్యాక్ మూవీ అని ‘ఎక్స్’ వేదికగా ప్రేక్షకులు ప్రశంసించారు. ఓవరాల్గా ఒక డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ అని ఓవర్సీస్ ప్రేక్షకులు తేల్చేశారు.

హృదయాన్ని తాకే ఒక ప్రేమ కథను, దేశ భక్తిని బ్యాలెన్స్ చేస్తూ ‘తండేల్’ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించే ప్రయత్నం చేశాడని.. అయితే ప్రథమార్థంలో గంట సేపు సినిమా నత్తనడకన సాగిందని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. దర్శకత్వం మరింత మెరుగ్గా ఉండి ఉంటే ‘తండేల్’ మరింత గొప్పగా ఉండేదని ఓవర్సీ్స్ షో చూశాక రివ్యూల్లో రాసుకొచ్చారు.

‘తండేల్’ సినిమాకు నాగచైతన్య, సాయిపల్లవి నటన ప్రాణం పోస్తే దేవీశ్రీప్రసాద్ పాటలు, ఫీల్ గుడ్ బీజీఎం వెన్నెముక అని సమీక్షకులు చెప్పుకొచ్చారు. వింటేజ్ డీఎస్పీ ‘తండేల్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల గుండెల్ని పిండేశాడని రివ్యూల్లో రాసుకొచ్చారంటే దేవీశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాలో ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. కథ వాస్తవికతకు దగ్గరగా ఉన్నా దర్శకుడు నిస్తేజంగా కథను చెప్పిన విధానం ‘తండేల్’ సినిమా స్థాయిని తగ్గించిందని, సాగతీతగా ప్రేక్షకులు భావించే అవకాశం ఉందని ఓవర్సీస్ రివ్యూయర్లు అభిప్రాయపడ్డారు.

సినిమాలో చివరి 20 నిమిషాల సమయంలో మాత్రం ఫీల్ గుడ్ మూమెంట్స్తో కన్నీటి సంద్రం ఖాయమని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో భాగమైన ఇండియా-పాకిస్తాన్ సబ్ప్లాట్ మాత్రం బలవంతంగా ఇరికించినట్టు ఉందని, సహజత్వం లోపించిందని రివ్యూ రాసుకొచ్చిన మెజార్టీ సమీక్షకులు అభిప్రాయపడటం గమనార్హం.

మొత్తంగా చెప్పాలంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను నాగచైతన్య, సాయి పల్లవి జంట నిరాశపరచని మాత్రం ఓవర్సీస్ రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ‘థ్యాంక్యూ’, ‘కస్టడీ’ సినిమాలు డిజాస్టర్లు కావడంతో ఒక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ‘తండేల్’ సినిమా ఒక మంచి కమ్ బ్యాక్ ఇచ్చిందని ఓవర్సీస్ ప్రేక్షకులు తేల్చేశారు. ఇది శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిన సినిమా.

వాస్తవంగా జరిగిన ఘటనలతో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను సమ్మిళతం చేసి తీసిన సినిమా కావడంతో ‘తండేల్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ‘తండేల్’ పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందడం ఈ సినిమా నుంచి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకులు ఆశించడానికి మరో కారణం. ‘తండేల్’ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియన్స్తో కళకళలాడే అవకాశం ఉంది.