‘తండేల్’ట్రైలర్ రివ్యూ.. సినిమా హిట్టో, ఫట్టో ట్రైలర్తోనే తేలిపోయింది..!

‘తండేల్’ట్రైలర్ రివ్యూ.. సినిమా హిట్టో, ఫట్టో ట్రైలర్తోనే తేలిపోయింది..!

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘తండేల్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 22 సెకన్ల నిడివి ఉన్న  ట్రైలర్ నాగచైతన్య, సాయిపల్లవి లవ్ స్టోరీతో మొదలైంది. శ్రీకాకుళం యాసలో సాయి పల్లవి వాయిస్ ఓవర్తో ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఉంది. సాయిపల్లవి, నాగచైతన్య ‘తండేల్’ సినిమాలో ఒకే ఊరిలో ఉండే ప్రేమ జంటగా ట్రైలర్తో స్పష్టమైంది. వీరి ప్రేమ గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారని సాయి పల్లవి చైతూతో చెప్పగా, మన గురించి మాట్లాడుతున్నారంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనని చైతూ ఆమెతో చెప్పాడు. అందరూ ఎలాగో మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది నిజం చేస్తే ఎలా ఉంటుందోనని యోచన చేస్తున్నట్లు సాయిపల్లవి చైతూతో సిగ్గుపడుతూ చెబుతుంది.

ఈ ప్రేమ కథకు సంబంధించిన షాట్స్ తర్వాత నాగచైతన్య యాక్షన్ సన్నివేశాలను ట్రైలర్లో చూపించారు. ట్రైలర్తోనే స్టోరీ ఏంటో కుండబద్ధలు కొట్టినట్టుగా దర్శకుడు చందూ మొండేటి చెప్పేశాడు. ఇటీవల విడుదలవుతున్న చాలా సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు కథను చెప్పీచెప్పకుండా దాచేస్తున్నా చందూ మొండేటి మాత్రం ఆ ఆలోచన చేయలేదు. బహుశా కథపై, స్క్రీన్ ప్లేపై దర్శకుడికి ఉన్న నమ్మకమే ఇందుకు కారణం కావొచ్చు. ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకుందనే చెప్పాలి.

ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, పరిస్థితులు పగబడితే ఆ ప్రేమికులు ఎదుర్కొనే ఎడబాటు, ఆ ఎడబాటును దాటుకుని ఆ ప్రేమ కథ తీరానికి చేరే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు. సింపుల్గా చెప్పాలంటే ‘తండేల్’ సినిమా స్టోరీ ఇది. శ్రీకాకుళం జిల్లాలో కొందరు మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు వెళ్తూ దారి తప్పి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేవీ అధికారులకు చిక్కి జైళ్లలో మగ్గిపోతున్నారు.

ఉన్న ఊరికి, భార్యాపిల్లలకు దూరమై పోయి దేశం కాని దేశంలో నరకం చూస్తున్నారు. అలాంటి పరిస్థితిలో చిక్కుకునే హీరో, ఆ హీరోపై పంచప్రాణాలు పెట్టుకుని ఎదురుచూస్తూ బతుకుతున్న లవర్, ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని తిరిగి కలుసుకునేందుకు హీరో చేసే ఒక ‘ప్రేమ యుద్ధం’. ఈ ప్రేమ యుద్ధానికి కొంత దేశ భక్తి కోణాన్ని దర్శకుడు చందు మొండేటి జోడించాడు. ‘తండేల్’ సినిమా ట్రైలర్ చూశాక అర్థమైన స్టోరీ అయితే ఇదే.

ALSO READ | SSMB29: రాజమౌళి సినిమా అంటే.. మహేష్తో సహా అందరికీ షరతులు వర్తిస్తాయి!

ఇలాంటి హృద్యమైన కథను రాసుకున్న దర్శకుడు తెరపై అంతే అందంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు అనుభూతి చెందితే ‘తండేల్’ సినిమా సక్సెస్ అయినట్టే. ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని కథ అయితే కాదు గానీ స్క్రీన్ ప్లేపైనే ‘తండేల్’ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం ‘తండేల్’ సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడం ఖాయం.

దేవీశ్రీప్రసాద్ అందించిన బాణీలు ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి. ‘బుజ్జి తల్లి’ సాంగ్ మంచి మెలోడీగా నిలిచిపోయింది. సాయిపల్లవి, చైతూ జంట కూడా చూడముచ్చటగా ఉంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ ‘తండేల్’ సినిమాకు బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమాకు కార్తీక్ తీడా కథను అందించాడు. ‘తండేల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది.