తంగేడు, పువ్వు మాత్రమే కాదు.. బతుకునిచ్చే కుల దేవత

తంగేడు, పువ్వు మాత్రమే కాదు.. బతుకునిచ్చే కుల దేవత

ఎనకట సౌడు భూములు, గుట్టలు, వాగుల్లో ఏడ చూసినా తంగేడు వనం కనిపిచ్చేది. ఈ చెట్లను ఎవరు పెట్టకున్నా... నీళ్లు పోయకున్నా.. వాటంతటవే పెరిగి పూలు పూసేది. ఇప్పుడు సూద్దామన్న ఏడా కానరావడం లేదు. గుట్టలను పలగచీరి, భూములను మట్టం చేసి వెంచర్లేసుడుతోటి తంగేడు చెట్లు ఆనవాళ్లు లేకుండా పోతున్నయి. కరీంనగర్​లోని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్టూడెంట్ల అధ్యయనంలో ఇదే ముచ్చట బయటకొచ్చింది. తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఆ బతుకమ్మ బంగారు ఆభరణంలా మెరవాలంటే తంగేడు పువ్వు ఉండాల్సిందే. ఈ పువ్వు పెట్టనిదే వేరు పువ్వు పేర్వరు. తంగేడు అంటే బతుకమ్మ పువ్వు మాత్రమే కాదు మాదిగల కులదేవత.. బతుకు నీడ కూడా. పుట్టుక నుంచి చావు వరకు వారి జీవనంలో ఒక భాగమిది. ఇలాంటి అరుదైన చెట్టును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు అందరిపై ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మన పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర చెట్టుగా జమ్మిజెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడును నిర్ణయించింది. రాష్ట్ర పుష్పం కనుమరుగయ్యే దశలో ఉంది. రియల్​ఎస్టేట్, మైనింగ్ ​కార్యకలాపాలు పెరగడంతో తంగేడు చెట్లు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతున్నాయి. దీన్ని పరిరక్షించకపోతే భవిష్యత్​లో బతుకమ్మకు ప్లాస్టిక్​పూలు పెట్టాల్సివస్తుందేమో! ఇప్పటికే చాలా చోట్ల రోడ్ల వెంబడి పెరిగే చెట్ల పూలను తంగేడు పూలు అని భ్రమపడుతున్నారు. తంగేడు కనుమరుగైతే సాంస్కృతిక నష్టంతోపాటు కొన్ని వర్గాల జీవితాలపైనా ప్రభావం పడుతుంది. 
 

కుల దేవతలా కొలుస్తరు..
గ్రామాల్లో అడవికి కట్టెలకు పోయినా, శేనుకాడికి పోయేటప్పుడైనా.. మహిళలు తంగేడు పువ్వును శిగలో పెట్టుకోకుండా ఉండరు. ఈ పువ్వును పెట్టుకోకుండా పోతే “బోసి శిఖతో పోతనావే బోడి మొఖమా” అని తంగేడు చెట్టు తిడతదని వారి విశ్వాసం. తంగేడు పువ్వును సాధారణంగా బతుకమ్మ పండుగ టైమ్​లోనే కొలుస్తరు. కానీ మాదిగలు మాత్రం జీవిత కాలం పలు సందర్భాల్లో మొక్కుతనే ఉంటరు. మాదిగల కులవృత్తి చెప్పులు కుట్టుడు. చెప్పులు కుట్టాలంటే తోలు కావాలి. ఆ తోలును శుభ్రపరిచేందుకు తంగేడు బెరడును వాడుతరు. పచ్చిగున్న తంగేడు కొమ్మలను చెక్క కొట్టే గూటంతో కొట్టి బెరడును తీసి పొడి చేసి, ఎండబెట్టి ఆ పొడిని గోలేంల పోసి తోలును నానబెట్టేది. ఇట్ల నాన పెట్టడం వల్ల తోలుపై ఉన్న వెంట్రుకలు ఊడిపోయి అది నున్నగా, మెత్తగా తయారయితది. దీంతోపాటు అది తోలుకు మంచి రంగును కూడా తెస్తుంది. బెరడు తీసిన కట్టెలను పారెయ్యకుండా పొయ్యిల కట్టెలకు వాడేవాళ్లు. ఇలా మాదిగలకు బతుకునిచ్చేది తంగేడు కాబట్టి కుల దేవతలా మొక్కుతరు. ఎల్లమ్మ పండుగకు తంగేడు ఆకును ఎండబెట్టి పొడి చేసి దాన్ని పట్నాల్లో కూడ వాడుతరు. తంగేడు పుల్లను వేపపుల్లలా నోట్లో వేసుకుంటే.. నోటి కంపు అంత కడిగేది. తంగేడు ఆకును నలిచి బొడ్డుకాడ పెట్టుకుంటే శరీర వేడిని తీసేసి సలువ చేస్తది. ఇలా తంగేడుకు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. 
 

జీవితంలో తోడు నీడగా..
చాలా ప్రాంతాల్లో పెండ్లి చేసుకున్న కొత్త జంట మొదాలు తంగేడు చెట్టుకు మొక్కే ఆచారం ఉంది. వీరుడి వేశం కట్టి, పులివేషాల ఊరేగింపుతో ఊరు అవుతల ఉన్న తంగేడు చెట్టుకాడికి పోయి కంకణం కట్టి, లింగాలు చేసి మొక్కుకుంటరు. ‘‘తల్లీ మాకు ఆదెరువు నువ్వే మమ్ముల సల్లంగ సూడు’’ అని వేడుకుంటరు. ఎవరైన మహిళ భర్త చనిపోతే తంగేడు చెట్టుకాడనే గాజులు పగులగొట్టి ఆమె ముత్తైదువును వదులుతారు. ‘‘నాకు భర్త లేడు. ఇగ నువ్వే దిక్కు. తోలుకు ఆసరా అయినట్టు నా బతుకుకు ఆసరా కావాలి” అని తలుసుకుంటరు. ఇటీవల మా బంధువు ఒకరు చనిపోతే ఆయన భార్య ముత్తైదువును వదిలేందుకు ఎక్కడా తంగేడు చెట్టు దొరకలేదు. చాలా సేపు దేవులాడిన తర్వాత.. దూరంలో ఏటి ఒడ్డుకు ఒక్క చెట్టు ఉంటే అక్కడకి తీసుకపోయి కార్యక్రమం పూర్తి చేయాల్సి వచ్చింది. ఇలా అందరి బతుకమ్మ పువ్వుకు ఆధారమైన, మాదిగల జీవితంలో భాగమైన తంగేడును ఎట్లన్నజేసి కాపాడుకోవాలి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                          - అశోక్​ కొండ్రు