ఇవాళ( అక్టోబర్ 13న) జగిత్యాలలో పసుపు బోర్డు రైతులు కృతజ్ఞతా సభ

జగిత్యాల: పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు రైతులు ఇవాళ ( అక్టోబర్ 13న) కృతజ్ఞతా సభ ఏర్పాటు చేస్తున్నారు.  మెట్పల్లిలోని వెంకట్ రెడ్డి గార్డెన్ లో జరిగే ఈ సభకు ముఖ్యఅతిథిగా నిమాజాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీసీ కమిషన్ బోర్డు మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి హాజరుకానున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో పసుపు పంట పేరు చెప్పగానే గుర్తయొచ్చేది నిజామాబాద్ జిల్లానే. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పసుపు పంట సాగు చేస్తూ దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. తెలంగాణలో ఉన్న ఏకైక పసుపు మార్కెట్ కూడా నిజామాబాద్ లోనే ఉంది. ప్రతి ఏటా నిజామాబాద్ మార్కెట్ కు ఆరు నుంచి ఎనిమిది లక్షల క్వింటాళ్ల పసుపు పంటను రైతులు తీసుకువస్తుంటారు. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాలో పసుపు పంటను సాగు చేస్తున్నప్పటికీ కేవలం నిజామాబాద్ లోనే అత్యధికంగా 35 నుంచి 40 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. పసుపు పంట సాగు చేస్తే బంగారం పండించినట్లేనని గతంలో రైతులు చెప్పుకునేవారు. అలాంటి ఉన్నత స్థితి నుంచి క్రమంగా మద్దతు ధర పడిపోతూ రైతులు నష్టాలు చవి చూడటం ఆనవాయితీగా మారిపోయింది. 

జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి మండలి ఆమోదం పొందడంతో ఉమ్మడి నిజామాబాద్ , కరీంనగర్, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా రైతులు, కమలం పార్టీ కార్యకర్తలు ఆనందోత్సహాల్లో తేలుతున్నారు. ప్రధాని మోదీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలోపేతమే లక్క్ష్యంగా పసుపు బోర్డు ప్రకటన చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా.. పసుపు బోర్డు ఏర్పాటు నిర్ణయం తెలంగాణలో కచ్చింతగా రైతులకు ఎలాగూ ఉపయోగంతోపాటు, బీజేపీకి కూడా రాజకీయ ప్రయోజనం కల్పించిందని విమర్శలు సైతం ఒప్పుకుంటున్న మాట.