హైదరాబాద్: 100 మంది ఎమ్మెల్యేలను దించి 10 వేల ఓట్లతో గెలవడం గొప్పనా అని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. మునుగోడు బైపోల్ రిజల్ట్స్ పై ఆయన స్పందించారు. ఈమేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. మునుగోడులో విజయం సాధించామంటూ టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, 10 వేల ఓట్లతో గెలవడం ఒక గెలుపేనా అని ఎద్దేవా చేశారు.
‘‘84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎంపీలను, మొత్తం పోలీసు వ్యవస్థను మునుగోడులో మొహరించారు. కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తామని టీఆర్ఎస్ నాయకులు ప్రజలను బెదిరించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వారిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇన్ని చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని మాత్రమే టీఆర్ఎస్ సాధించింది. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రలజకు అసంతృప్తి ఉందని మునుగోడు ఫలితంతో స్పష్టమైంది’’ అని తరుణ్ చుగ్ అన్నారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పారు. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచిందని, నైతిక విజయం మాత్రం తమదేనని స్పష్టం చేశారు. మునుగోడులో ఇచ్చిన హామీలను 15 రోజుల్లోగా నెరవేర్చాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.