కంపెనీ మునిగింది బ్యాంకును ముంచింది

ఆ బ్యాంకుకు  8 వేల కోట్లకు పైగా బాకీలు వసూలు
కావాల్సి ఉంది. అందులో 6,500 కోట్లు ఒకే కంపెనీ నుంచిరావాలి.
అంటే మూడొంతుల సొమ్ము ఒక్క కంపెనీ నుంచే రావాలి.
కానీ ఆ కంపెనీ దివాలా తీసింది. దానితో బ్యాంకు కూడా మునిగిపోయింది.
ఆ బ్యాంకు పీఎంసీ. ఆ కంపెనీ హెచ్ డీఐఎల్.
11 ఏళ్లలో ఎగ్గొట్టినవి 2 లక్షల కోట్లు!

ఎన్​డీయే ప్రభుత్వం 2024 లోక్​సభ ఎన్నికలనాటికి ఎకానమీని 5 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే… గడచిన 11 ఏళ్లలో జరిగిన బ్యాంకు మోసాలు 1.85 ట్రిలియన్​ (1,85,624 కోట్లు) రూపాయల మేర జరిగాయి. ఒక్క 2016–17లోనే 26 వేల కోట్ల వరకు బ్యాంక్​ల ఫ్రాడ్​ జరిగింది. 2008–09 నుంచి ఇప్పటివరకు 44,016 కేసులు నమోదయ్యాయి. ఏ ఏటికాయేడు 15 శాతానికిపైగా బ్యాంకులను దగా చేసిన కేసులు పెరుగుతున్నాయే తప్ప, కంట్రో ల్​ కావడం లేదు. వీటిలో పబ్లిక్​ సెక్టార్​బ్యాంకుల్లో జరిగే మోసాలు 56 శాతం వరకు ఉంటున్నాయి!

పీఎంసీ స్కామ్ జరిగింది ఇట్లా…

పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కో–ఆపరేటివ్​ బ్యాంక్​ స్కాం ఎలా జరిగిందన్న విషయంలో ‘ముంబై పోలీసు ఆర్థిక నేరాల వింగ్​ (ఈఓడబ్ల్యూ)’ ఒక స్పష్టతకు వచ్చింది. ఈ వింగ్​ వెల్లడించిన వివరాల ప్రకారం…

బ్యాంక్​ కష్టకాలంలో వాధ్వాన్​ కుటుంబం డిపాజిట్లు కుమ్మరించి ఆదుకుంది కాబట్టి; వాళ్లకు అవసరమైనప్పుడు ఉదారంగా రుణాలిచ్చి దెబ్బతిన్నది.

వాధ్వాన్​కి చెందిన హౌసింగ్​ డెవలప్​మెంట్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​ (హెచ్​డీఐఎల్​)కి మొత్తం 18 అనుబంధ కంపెనీలున్నాయి. వీటిని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) గుర్తించి, సోదా జరుపుతోంది.

ఈ కంపెనీలన్నిటికీ కలిపి పీఎంసీలో 44 లోన్​ అకౌంట్లున్నాయి..  రుణాలుగా ఇచ్చిన మొత్తం 6,500 కోట్ల రూపాయలు.

హెచ్‌‌డీఐఎల్ గ్రూప్‌‌కు చెందిన 44 లోన్ అకౌంట్ల నుంచి పైసా వాపసు రావడం లేదు. వాస్తవానికి వీటిని ఎన్​పీఏలుగా ప్రకటించాలి. అలాచేస్తే హెచ్‌‌డీఐఎల్‌‌ డిఫాల్ట్ అయిన విషయాన్ని బయటకు పొక్కుతుంది.

బ్యాంక్​ చైర్మన్​, ఎండీ స్థాయిలో హెచ్​డీఐఎల్​ కుమ్మక్కయి  21,049 నకిలీ అకౌంట్లను సృష్టించారు.  డిఫాల్టయిన 44 లోన్ అకౌంట్లను ఈ మాస్క్​డ్​ అకౌంట్లు (నకిలీ లోన్ అకౌంట్లు)తో రీప్లేస్ చేశారు.

వీటిని వాడుకోవడానికి వీలుగా పాస్​వర్డ్ భద్రత కల్పించారు. పెద్ద మొత్తాన్ని పది చిన్న మొత్తాలుగా విడదీసి, తలా కొంత పంచినట్లుగా హెచ్​డీఐఎల్​ మాస్క్​డ్​ అకౌంట్లలోకి లోన్​ అమౌంట్​ చేరిపోయింది. బ్యాంక్​ ఇచ్చిన ప్రత్యేక పాస్​వర్డ్​ ద్వారా మాస్క్​డ్​ అకౌంట్ల నుంచి హెచ్​డీఐఎల్​ ప్రమోటర్స్​ సొమ్ము  డ్రా చేసేసుకున్నారు.

పీఎంసీ బ్యాంక్‌‌ సృష్టించిన ఈ నకిలీ అకౌంట్ల వివరాలు ఆర్‌‌‌‌బీఐకిచ్చిన లోన్ అకౌంట్లలో ఉన్నాయి. అయితే, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌‌లో మాత్రం ఈ రుణాల వివరాలను గల్లంతు చేశారు. దీనికోసం బ్యాంక్​ సాఫ్ట్​వేర్​ని కూడా ట్యాంపర్​ చేశారు.

ఈ అక్రమ లావాదేవీల వ్యవహారమంతా పీఎంసీలో క్రెడిట్​ డిపార్టుమెంట్​లో పనిచేసే ఉద్యోగినులవల్ల బయటపడ్డాయి. కొన్ని వేల ఘోస్ట్​ అకౌంట్లు (నకిలీ లోన్​ ఖాతాలు) తమ దృష్ఠికి వచ్చాయని ఆర్​బీఐకి చెప్పడంతో మొత్తం డొంకంతా కదిలింది.

ఘరానా మోసాలు జరిగే చోటు ఏదైనా ఉందంటే కచ్చితంగా బ్యాంకుల్లోనే అనేది జనాల నమ్మకం. ఒకప్పుడు బ్యాంకులంటే నమ్మకానికి పెట్టింది పేరుగా ఉండేది. ఏదైనా చిల్లర లావాదేవీల్లో… ‘నీ సొమ్ము ఎక్కడికీ పోదు. నాకు ఇస్తే బ్యాంకులో దాచుకున్నట్లే…’ అన్నంత భరోసాతో మాట్లాడేవాళ్లు. ఈ సీన్​ పాతికేళ్ల నుంచి మారిపోయింది. బ్యాంకింగ్​ రంగంలోకి కోఆపరేటివ్ బ్యాంకులు అడుగుపెట్టడంతో జనాల దగ్గర సొమ్మును డిపాజిట్లుగా రాబట్టడానికి, వాటిని రుణాల రూపంగా మార్చి బోర్డు డైరెక్టర్లు తేలిగ్గా దక్కించుకోవడానికి రూట్​ ఏర్పడింది. గడచిన పాతికేళ్ల చరిత్రను తిరగేస్తే… బోర్డు తిప్పేసిన కోఆపరేటివ్​ బ్యాంకులు చాలా ఉన్నాయి. కాస్త అటు ఇటుగా అన్నింటి కథ ఒకటే. ఎందుకంటే, వీటిపై ఆర్​బీఐ కంట్రోల్​ ఉండదు.

తాజాగా పంజాబ్​ అండ్​ మహారాష్ట్ర కో–ఆపరేటివ్​ బ్యాంకు లిమిటెడ్​ (పీఎంసీ) కూడా అదే దారిలో వెళ్లి దెబ్బతిన్నది. సెప్టెంబర్​లో మొత్తం మొండి పద్దులు 8,880 కోట్ల రూపాయలు కాగా,  దానిలో ఒక్క ఖాతాదారుకే 73 శాతం అంటే 6,500 కోట్లు అప్పులు ఇచ్చిన రికార్డ్​ పీఎంసీది! రెండు మూడేళ్లుగా పైసా కట్టని హౌసింగ్​ డెవలప్​మెంట్​ అండ్​ ఇన్​ఫ్రాస్టక్చర్​ లిమిటెడ్​ (హెచ్​డీఐఎల్​)కి మళ్లీ మళ్లీ అప్పులిచ్చింది. చివరిసారిగా ఆగస్టు 31నాడు 96 కోట్ల 50 లక్షల రూపాయలివ్వడాన్నిబట్టి వైట్​ కాలర్​ మోసాలు ఏ రేంజ్​లో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి, పీఎంసీ దాదాపు 35 ఏళ్ల క్రితమే డేంజర్​లో పడింది. 1986–87లో బ్యాంక్​ పరిస్థితి దివాలా అంచుల్లోకి వెళ్లింది. అప్పట్లో వాధ్వాన్​ ఫ్యామిలీకి చెందిన కొన్ని కంపెనీలు బ్యాంకుని గట్టెక్కించడానికి కేపిటల్​ సర్దుబాటు చేశాయి. వాళ్లలో ప్రస్తుతం బ్యాంకుని ముంచేసిన హెచ్​డీఐఎల్​ చైర్మన్​ రాకేశ్​ వాధ్వాన్​కూడా ఉన్నారు. 2004లో మరోసారి బ్యాంకు ఇబ్బందుల్లో పడితే రాకేశ్​ అన్న రాజేశ్​ వాధ్వాన్​ 100 కోట్ల రూపాయల వరకు డిపాజిట్​ చేశారు. 2011కల్లా 57 బ్రాంచీలకు, 2,824 కోట్ల డిపాజిట్ల స్థాయికి పీఎంసీ ఎదిగింది. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు ‘థ్యాంక్స్​ గివింగ్​’ కింద హెచ్​డీఐఎల్​కి దాసోహమైపోయింది. అక్కడి నుంచి బ్యాంక్​ బోర్డు ఆఫ్​ డైరెక్టర్స్​ పూర్తిగా హెచ్​డిఐఎల్​ ఏది చెప్తే అది చేయడం మొదలెట్టారు. ఎలాగంటే… 2007లో హెచ్​డీఐఎల్​ లిస్టెడ్​ కంపెనీగా మారింది. పీఎంసీకి ఇవ్వాల్సిన రుణాలన్నీ తీర్చేసింది.

తమకు కావలసిన అప్పులకోసం ఇతర బ్యాంకులను సంప్రదించడం మొదలెట్టింది. అయితే, కష్టకాలంలో తమను ఆదుకున్నారు కాబట్టి, అప్పులుకూడా తామే ఇస్తామని పీఎంసీ వాళ్లు రిక్వెస్ట్​ చేశారు. ‘అక్కడా ఇక్కడా తిరగడమెందుకు? ఈ బ్యాంకు మీవల్లనే నిలబడ్డది. మీరు ఆపదలో ఉంటే మేం చూస్తూ ఊరుకుంటామా’ అంటూ ఆపద్బాంధవుడిలా ముందుకొచ్చింది పీఎంసీ. దాంతో బ్యాంకు పూర్తిగా హెచ్​డీఐఎల్​ ఇంటి బ్యాంకు మాదిరి తయారైంది. ఈ ఏడాది మార్చి 31న ఫైనాన్షియల్​ క్లోజర్​లో మొత్తం డిపాజిట్లు 11,617.34 కోట్ల రూపాయలు కాగా, రుణాల రూపంలో 8,383 కోట్లు బయటికి వెళ్లాయి. స్కాం వెలుగు చూసే సమయానికి 73 శాతం అప్పులు ఒక్క హెచ్​డీఐఎల్​కే ఇచ్చినట్లు రికార్డులు చెప్తున్నాయి.

పీఎంసీ పుంజుకున్న సమయానికి (2013 నాటికి) హెచ్​డీఐఎల్​కి కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకులకు రుణాలు చెల్లించలేని దశకు చేరింది. ఈ ఖాతాదారుడ్ని ఎన్​పీఏలోకి చేరిస్తే ఆర్​బీఐవల్ల ఇబ్బందులేర్పడతాయన్న ఉద్దేశంతో స్టాండర్డ్​ అకౌంట్లుగానే బ్యాలెన్స్​ షీటులో చూపిస్తూ వచ్చారు. ఇప్పడు బ్యాంక్​ని ముంచేసింది ఈ లావాదేవీయే. రంగంలోకి ఆర్​బీఐ దిగడం, ఖాతాదారుల విత్​డ్రాయల్​పై లిమిట్​ పెట్టడం, మరోపక్క బ్యాంక్​ మాజీ మేనేజింగ్​ డైరెక్టర్​ జాయ్​ థామస్​ని అదుపులోకి తీసుకోవడం వగైరాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఏ బ్యాంకు అయినాగానీ ఎక్కువ వడ్డీని ఆశ చూపెట్టి డిపాజిట్లు కలెక్ట్​ చేస్తాయి. సగటు మిడిల్​ క్లాస్​ మనుషులు తమ దగ్గరున్న తృణమో పణమో ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులో దాచుకోవాలనుకుంటారు. పీఎంసీ​ విషయంలోనూ అదే జరిగింది. డిపాజిట్లు చేసినవాళ్లంతా సామాన్యులే. తమ సొమ్ము తిరిగి చేతికొస్తుందో లేదో  అని వీళ్లంతా ఇప్పుడు బెంగలో పడ్డారు.

వీళ్లు కాకుండా మరో రకంగా మోసపోయినవాళ్లు హెచ్​డీఐఎల్​ ఖాతాదార్లు. సుమారు 40 ఏళ్లుగా హౌసింగ్​ రంగంలో ఉన్నందున జనాలకు బాగా నమ్మకం ఏర్పడింది. ఆ సంస్థ 2010లో ముంబై మహానగరం శివారుల్లోని ములుంద్​, నహూర్​ ఏరియాల్లోనూ, పాల్ఘార్​ జిల్లాలోనూ హౌసింగ్​ ప్రాజెక్టులు చేపట్టింది. వీటి బ్రోచర్లు చూసిన జనం ఎగబడి మరీ అడ్వాన్స్​ ఇచ్చి బుక్​ చేసుకున్నారు. ఈ తొమ్మిదేళ్లలోనూ ఒక్క ఇటుక పేర్చకపోవడం, పీఎంసీ స్కాంలో హెచ్​డీఐఎల్​ పేరు బయటకి రావడం బెంబేలెత్తిస్తోంది. ఈ స్కీమ్​ల కోసం 700 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని చేతులెత్తేసింది. సొంత ఇంటికోసం ఆశపడ్డవాళ్లే 350 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్​ కింద కట్టారు. ఈ ప్రాజెక్ట్​ల్లో సుమారు 450 మంది బాధితులు తయారయ్యారు. వీళ్లందరూ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లెటర్లు రాస్తున్నారు.

స్కూళ్లకు, హాస్పిటళ్లకు దెబ్బ
PMCపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు అమలు చేయడంతో ఈ ప్రభావం అనేక స్కూళ్లపై పడింది. ‘గురునానక్ విద్యాయక్ సొసైటీ (జీఎన్ వీఎస్)’ చాలా పెద్ద ట్రస్ట్. ఈ ట్రస్ట్ కింద ముంబై సిటీలో 37 స్కూళ్లు నడుస్తున్నాయి. 20 వేల మందికి పైగా చిన్నారులు ఈ స్కూళ్లలో చదువుకుంటున్నారు. ఈ స్కూళ్ల అకౌంట్లన్నీ పీఎంసీలోనే ఉన్నాయి. ట్రస్టు డబ్బంతా ఈ ఖాతాల్లోనే ఉంది. వందలాది సిబ్బంది శాలరీ అకౌంట్​కూడా పీఎంసీలోనే ఉంది. స్కూళ్లలో పనిచేసే టీచర్లకు, మిగతా సిబ్బందికి సెప్టెంబరు నెల జీతాలు ఇవ్వలేకపోయింది. స్కూళ్ల  కరెంటు బిల్లులను కూడా చెల్లించలేకపోయింది.

ఈఎంఐలకు ఇబ్బందులు

స్కూళ్లతోపాటు బాంద్రా ఈస్ట్ ఏరియాలో ‘గురునానక్ హాస్పిటల్’ను కూడాఈ ట్రస్టు నడుపుతోంది. ఆస్పత్రికి సంబంధించిన 18 కోట్ల రూపాయలు పీఎంసీ బ్యాంకులో ఇరుక్కున్నాయి. ఇందులో 10 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. నెలనెలా ఆస్పత్రి ఖర్చుల కోసం విత్ డ్రా చేసుకునే డబ్బు చేతికందలేదు. ఫలితంగా తమ ట్రస్ట్ ఇష్యూను స్పెషల్ కేసు కింద తీసుకుని విత్ డ్రా పర్మిషన్ ఇవ్వాలని జీఎన్వీఎస్ చైర్మన్ మంజీత్ సింగ్ భట్టి ఆర్​బీఐని కోరారు.  జీతాల నుంచి చాలామంది హౌస్ లోన్లకు సంబంధించి ఈఎంఐలు కట్టుకుంటారన్నారు. జీతాలు అందకపోవడంతో సిబ్బంది లబోదిబోమంటున్నారు.

రైల్వే కాంట్రాక్టర్ ఇబ్బందులు

జోహార్…ఈయన ఓ రైల్వే కాంట్రాక్టర్. ఈయనకు పీఎంసీలో అకౌంట్ ఉంది. ఈయన దగ్గర పాతిక మంది సిబ్బంది పనిచేస్తారు. తన పర్సనల్ అకౌంట్​లో సొమ్మున్నా పెద్ద అమౌంట్ విత్ డ్రా చేసుకునే సదుపాయం లేకపోవడంతో శాలరీలు చెల్లించలేకపోయాడు.