నన్ను చాలా భయపెట్టింది: కేఎల్ రాహుల్

న్యూఢిల్లీ: ఇండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ షో ఎపిసోడ్‌‌‌‌  కాంట్రవర్సీపై తొలిసారి పెదవి విప్పాడు. దీనిపై వచ్చిన విమర్శల దాడి తనను చాలా భయపెట్టిందన్నాడు. ఈ వివాదం తనను మనిషిగా మార్చిందని చెప్పాడు. బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్వహించే ఈ టాక్ షోలో కేఎల్‌‌‌‌, పాండ్యా  ఐదేండ్ల కింద పాల్గొన్నారు. ఇందులో మహిళల గురించి చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగడంతో అప్పట్లో పాండ్యా, రాహుల్‌‌‌‌ను బీసీసీఐ ఓ సిరీస్‌‌‌‌ నుంచి సస్పెండ్‌‌‌‌ చేసింది. తాజాగా కేఎల్‌‌‌‌ ఆ వివాదం గురించి గుర్తు చేసుకున్నాడు. 

‘ఆ షో నన్ను చాలా మార్చేసింది. చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ. ఎవ్వరితోనూ ఎక్కువ మాట్లాడే వాడిని కాదు. అయితే, ఇండియాకు ఆడిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. వంద మందితో ఒక గదిలో ఉన్నా వారందరితో  మాట్లాడేవాడిని. కానీ, ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. ఎందుకుంటే  ఆ ఇంటర్వ్యూ  నన్ను చాలా భయపెట్టింది. టీమ్‌‌‌‌ నుంచి సస్పెండ్‌‌‌‌ అయ్యేలా చేసింది. నేను స్కూల్లో కూడా  సస్పెండ్‌‌‌‌ అవ్వలేదు. ఎప్పుడూ పనిష్మెంట్‌‌‌‌ తీసుకున్నది లేదు. కానీ, ఇంటర్వ్యూ నా జీవితంలో మొదటిసారి ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన  అనుభవం’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.