
- సీబీఐ, ఈడీలాగా ఎన్డీఎస్ఏను కేంద్రం వాడుకుంటున్నది
- కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు రిపోర్ట్‌లో ఎక్కడా చెప్పలేదు
- ఎన్డీఎస్ఏ పేరుతో మంత్రి ఉత్తమ్ రాజకీయ ప్రసంగం చేశారు
- మేడిగడ్డలో ఏడో బ్లాక్ ఒక్కటే కుంగింది.. దాన్ని తిరిగి కట్టాలి
- హైలెవెల్ కమిటీలో చర్చించాకే అన్నారం, సుందిళ్ల లొకేషన్ల మార్పు
- అన్ని టెస్టులు, డిజైన్ల ప్రకారమే బ్యారేజీలు నిర్మించామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్ట్‌లో ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎన్డీఎస్ఏ పేరుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రసంగం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రైమరీ రిపోర్ట్, పార్లమెంట్ ఎన్నికలప్పుడు మధ్యంతర రిపోర్ట్, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు తుది రిపోర్ట్ అంటూ విడుదల చేశారని అన్నారు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదని.. ఎన్డీయే రిపోర్ట్ అని విమర్శించారు.
సీబీఐ, ఈడీలాగానే ఎన్డీఎస్ఏను కూడా కేంద్రం రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై రిపోర్టును రిలీజ్ చేశాయని అన్నారు. మంగళవారం హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించిందని, గతంలో ఎంపీగా ఉన్న ఉత్తమ్ కూడా ఆ బిల్లును వ్యతిరేకించారని గుర్తుచేశారు. అప్పుడేమో రాష్ట్రాల హక్కులను కబ్జా చేయడమేనని అన్న ఉత్తమ్‌కు.. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఎలా కరెక్ట్ అయిందని ప్రశ్నించారు. ఎన్ని చేసినా బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకోలేకపోయారని, ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రసంగంపైనే చర్చ నడుస్తున్నదని తెలిపారు.
పోలవరానికి ఎందుకు పోలే?
పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నది ఎన్డీఎస్ఏనేనని, ఆ ప్రాజెక్టు డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కుప్పకూలినా ఇప్పటిదాకా అక్కడకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. నాలుగైదేండ్లు అయినా పోల వరంపై రిపోర్టు ఇవ్వలేదన్నారు. అసలు ఎస్ఎల్ బీసీ ప్రమాదం కన్నా పెద్ద డిజాస్టర్ ఇంకా ఏముంటుందని ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 60 రోజులు అవుతున్నా.. అందులో చిక్కుకున్నవారి జాడను కనుక్కోలేకపోయారని, ఇంతకన్నా ఫెయిల్యూర్ ఏముంటుందని నిలదీశారు.
తుమ్మిడిహెట్టి విషయంలో తప్పు చేసిందే కాంగ్రెస్ అని అన్నారు. వైఎస్ హయాంలో 2008లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, సర్వే మొబిలైజేషన్ పేరిట రూ.1,426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారని చెప్పారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఆనాడు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, ఆనాడు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కూడా ఆ దోపిడీలో భాగమయ్యారని ఆరోపించారు.
తప్పును సరిచేసినం
నాడు కాంగ్రెస్ చేసిన తప్పును తమ బీఆర్ఎస్ ప్రభుత్వం సరిచేసిందని హరీశ్ తెలిపారు. తుమ్మిడిహెట్టి విషయంలో నాడు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో చర్చలు జరిపామని, స్వయంగా కేసీఆర్ వెళ్లారని చెప్పారు. మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముషారఫ్‌తో తాను చర్చలు జరిపానని తెలిపారు. ఎంత డబ్బైనా ఇస్తాం..తుమ్మిడిహెట్టి వద్ద అనుమతి ఇవ్వాలని కోరినా ఒప్పుకోలేదన్నారు.
ఉత్తమ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ క్లియర్‌గా చెప్పిందని గుర్తు చేశారు. కేంద్రం నీళ్లు లేవని చెప్పడంతోనే మేడిగడ్డ వద్దకు బ్యారేజీని మార్చామని తెలిపారు. మేడిగడ్డ డీపీఆర్‌ను 4 నెలల్లోనే తయారు చేశామంటున్నారని.. కానీ, కొడంగల్– నారాయణపేట లిఫ్ట్‌కు ఇప్పటివరకు డీపీఆర్ ఉందా? అని ప్రశ్నించారు.
డీపీఆర్ లేకుండానే టెండర్లను ఎలా పిలిచారని ప్రశ్నించారు. ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చామంటున్నారని.. కానీ, కాంగ్రెస్‌లాగా రూ.170 కోట్లు బ్రోకర్‌కు లంచం ఇచ్చి అప్పులు తీసుకురాలేదని అన్నారు. బ్రోకర్‌కు పైసలిచ్చి హెచ్‌సీయూ భూములను తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారని ఆరోపించారు.
అన్నారం, సుందిళ్ల లొకేషన్ మారింది నిజమే..
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చింది నిజమేనని హరీశ్ రావు తెలిపారు. హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకే అన్నారం, సుందిళ్ల లొకేషన్లను మారుస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. అన్నిరకాల టెస్టులు చేశాకే, డిజైన్ల ఆధారంగానే బ్యారేజీలను నిర్మించామని వెల్లడించారు. మేడిగడ్డ ఫీజిబుల్ కాదంటూ ఫైవ్‌మెన్ కమిటీ రిపోర్టు చెప్పలేదని, మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు డైరెక్ట్ లిఫ్ట్ సాధ్యం కాదని మాత్రమే చెప్పిందని అన్నారు.
అందుకే అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు లిఫ్ట్ చేశామన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక్క ఏడో బ్లాక్ తప్ప.. మిగతా అంతా బాగానే ఉందన్నారు. ఆ బ్లాక్‌ను తొలగించి కొత్తగా నిర్మిస్తే దానిని వాడుకోవచ్చంటూ ఎన్డీఎస్ఏనే చెప్పిందన్నారు. చేతనైతే త్వరగా రిపేర్లు చేసి మేడిగడ్డను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బ్యారేజీల్లో 2 టీఎంసీలకు మించి స్టోర్ చేయొద్దంటూ ఉత్తమ్ చెబుతున్నారని, కానీ, గంగా నదిపై నిర్మించిన ఫరక్కా బ్యారేజ్‌ను 30 టీఎంసీల స్టోరేజీతో నిర్మించారని చెప్పారు.
దాని డెడ్‌స్టోరేజ్ అంత కూడా మన బ్యారేజీల స్టోరేజ్ లేదని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్.. పోలవరం అథారిటీ చైర్మన్‌గా ఆ ప్రాజె క్టును నిర్మిస్తే అది కుప్పకూలిందని ఆరోపించారు.