యాదాద్రి ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. వైష్ణవ ధర్మాచారాలను ఫాలో అయ్యేవారికి ఇది ముఖ్య పుణ్యక్షేత్రం. ఈ ఏరియాని తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ధార్మిక స్థలంగా తీర్చిదిద్దాలన్న సర్కారు సంకల్పం మెచ్చుకోదగ్గదే. ఆలయాన్ని రూ.1,800 కోట్ల ఖర్చుతో ఎంతో శ్రద్ధగా నిర్మిస్తున్నారు. తెలంగాణ చరిత్రను కళ్లకు కట్టేలా శిల్పాల రూపంలో గుడి గోడలపై చెక్కుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ చరిత్రలో ముసునూరి నాయకులకు స్థానం కల్పించలేదని తెలుస్తోంది.
తెలంగాణ చరిత్రలో ముసునూరి నేతలకు ఎంతో ప్రాధాన్యం ఉంద. అలాంటివారికి యాదాద్రిలో చోటు లేకపోవటం దారుణం. దీనికి దారితీసిన కారణాలేంటో తెలియదు. ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే… 1323వ సంవత్సరం తెలంగాణను ప్రతాపరుద్రుడు పాలిస్తున్న కాలం. అప్పుడు రాజధానిగా ఓరుగల్లు ఉండేది. సిరిసంపదలతో తులతూగుతున్న కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ల కన్నుపడింది. అనేకసార్లు దండయాత్రలు చేశారు. ఈ రాజ్యాన్ని నేలమట్టం చేయాలనే చెడు ఉద్దేశంతో పావులు కదిపారు.
1323లో ఢిల్లీ పాలకుడు ఘియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకు మహమ్మద్ బిన్ తుగ్లక్కు పెద్ద సైన్యం ఇచ్చి ఓరుగల్లు మీదికి పంపించాడు. ఈ యుద్ధం ఆరు నెలలు సాగింది. చివరికి కాకతీయ ప్రతాపరుద్రుడు ఓడిపోయి బందీగా దొరికాడు. అతనిని ఢిల్లీకి తీసుకెళుతుండగా దారి మధ్యలోనే నర్మదా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైంది. తెలంగాణ ప్రాంతం ఢిల్లీ పాలకులకు (తుగ్లక్ వంశీయులకు) సామంత రాజ్యమైంది. ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మార్చారు.
ప్రతాపరుద్రుడు మరణించాక ఢిల్లీ సుల్తాన్లను ఓడించిన కమ్మ నాయక రాజులైన ముసునూరి నాయకులు, గురిజాల నాయకులు తెలంగాణను పాలించారు. తెలుగు భాషాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పలువురు పండితులను ఎంకరేజ్ చేశారు. మడికి సింగన్న వీరి ప్రధాన ఆస్థాన కవి. అతను వాశిష్ఠ రామాయణం, పద్మ పురాణం, సకల నీతి సమ్మతం లాంటి గ్రంథాలు రాశారు. సుల్తాన్పూర్గా మారిన తెలంగాణ రాజ్యాన్ని జయించి దానికి మళ్లీ పాత పేరైన ‘ఓరుగల్లు’ని పెట్టారు.
తెలుగు ప్రాంతాన్ని పాలించిన తెలంగాణ యోధుడు ముసునూరి కాపయ్య నాయకుడు, అతని సామంతుడైన కరీంనగర్ రామగిరి కోట పాలకుడు గురిజాల ముప్ప భూపతుల వంశ చరిత్రను యాదాద్రి ఆలయంలో పొందుపర్చాలి. తెలంగాణ చరిత్ర అంటే వర్తమాన చరిత్రే కాదు. వందల ఏళ్ల పోరాట యోధుల త్యాగ చరిత్ర. అప్పట్లో యాదాద్రి కమ్మ నాయక వీరుల ఏలుబడిలోనే ఉండేది. 1361లో ముసునూరి వినాయక దేవుడు ఓరుగల్లు నుంచి వెళ్లి, బహమనీ సుల్తాన్లతో తలపడి భువనగిరి కోటను జయించి యాదాద్రిని రక్షించాడు.
తర్వాత జరిగిన యుద్ధంలో బహమనీ సుల్తాను ముహమ్మద్ షా… ముసునూరి వినాయక దేవుడిని క్రూరంగా చంపాడు. నాలుక కోసి, బతికుండగానే కోట గోడల మీద నుంచి మంటల్లోకి నెట్టేశాడు. ఈవిధంగా బహమనీ సుల్తాన్ల నుంచి తెలంగాణ ప్రాంతాన్ని రక్షించడం కోసం ముసునూరి వినాయక దేవుడు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు. తెలంగాణ తొలి ఫ్రీడం ఫైటర్లుగా పోరాడిన ఈ వీరుల గొప్ప చరిత్రలను, శిల్పాలను తెలంగాణ ప్రభుత్వం రూపొందించాలి. తద్వారా ముందు తరాలకు తెలిసేలా చేయాలి. – యడ్లపల్లి అమర్నాథ్
తెలంగాణలో సుల్తాన్ల పాలన ఘోరంగా ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. ఆ కష్ట పరిస్థితుల్లో ముసునూరి కాపయ్య నాయకుడు (1334లో) ఓరుగల్లు మీదికి దండెత్తి ఢిల్లీ సుల్తాన్లను ఓడించి తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్ర్యం తెచ్చాడు. ముసునూరు నాయకులు కాకతీయుల కాలంలో కమ్మనాడు నాయంకర్లుగా ఉండేవారు. కాకతీయ రాజులకు సామంతులుగా ఉంటూ తమ ప్రభువైన ప్రతాపరుద్రుడికి ఢిల్లీ సుల్తాన్లకు మధ్య జరిగిన 8 యుద్ధాల్లో పాల్గొన్నారు. వీటిలో ఏడు సార్లు విజయాలను అందించారు. ఆలయాన్ని రూ.1,800 కోట్ల ఖర్చుతో ఎంతో శ్రద్ధగా నిర్మిస్తున్నారు. తెలంగాణ చరిత్రను కళ్లకు కట్టేలా శిల్పాల రూపంలో గుడి గోడలపై చెక్కుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇందులో ముసునూరి నాయకులకు స్థానం కల్పించకపోతే చరిత్ర అసమగ్రంగా ఉండిపోతుంది.