Team India: అమ్మతోడు నేను తిట్టలేదు.. నన్ను నమ్మండి: డ్రెస్సింగ్ రూమ్ లుకలకలపై గంభీర్

Team India: అమ్మతోడు నేను తిట్టలేదు.. నన్ను నమ్మండి: డ్రెస్సింగ్ రూమ్ లుకలకలపై గంభీర్

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఓటమి అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం చెడిందంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. డ్రెస్సింగ్‌ రూమ్‌లో నలుగురైదుగురు ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్‌ కఠిన వ్యాఖ్యలు చేసినట్లు లీకులు బయటకొచ్చాయి. 

ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించనప్పటికీ.. కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్లు ఆడకుండా, సహజమైన ఆట పేరుతో సొంత ఆట ఆడి ఔటవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ గంభీర్‌ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హెడ్ కోచ్‌గా తాను బాధ్యతలు చేపట్టిన నాటి సీనియర్ల విషయంలో అంటి ముట్టనట్లు వ్యవహరించినట్లు గంభీర్.. మున్ముందు జట్టులో అటువంటి వాటికి చోటులేదని గంభీర్ హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ,ఇదే విషయాన్ని ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతని ముందు ప్రస్తావించగా.. లీకులపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ALSO READ | రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్మన్ గిల్

శుక్రవారం నుంచి భారత్‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో చివరి టెస్ట్‌ జరగనుంది. ఈ టెస్టుకు ముందు జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు గంభీర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో లుకలుకలపై మాట్లాడిన గంభీర్.. అవన్నీ కల్పితమని కొట్టిపారేశారు. వస్తున్న వార్తల్లో నిజం లేదు కావున రిపోర్టర్లు అడుగుతున్న ఏ ప్రశ్నకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 

జట్టు ఏయే విషయాలపై పని చేయాలన్నది ప్రతి ఒక్క ఆటగాడికి తెలుసునని.. రాబోయే టెస్టులో ఎలా గెలవాలన్న దానిపై మాత్రమే తాము చర్చించామని గంభీర్ స్పష్టం చేశారు. సీనియర్‌ ప్లేయర్లు రోహిత్‌, విరాట్‌తో తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించే ఏ సంభాషణనైనా అక్కడికే పరిమితం చేయాలని అన్నారు.

గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సంజీవం

ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో టీమిండియా గెలిస్తే.. సిరీస్ సమం అవుతుంది.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సంజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఆశలు వదులుకోవలసిందే.