గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు 18 నెలల చిన్నారి కిడ్నాప్ కేసును చేధించారు. నాలుగు గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. ఈ కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. చిన్నారి తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్య తెలిపిన వివరాల ప్రకారం..
పెళ్లి అయ్యి ఎనిమిదేళ్లు అయినా తన కూతురికి ఇంకా పిల్లలు పుట్టకపోవడంతో బాధపడుతోంది ఓ మహిళ. ఎవరి పిల్లలను అయినా పెంచుకోవాలని లేదంటే కిడ్నాప్ చేయాలని అనుకుంది.
సోమవారం (డిసెంబర్ 25న) రోజు పర్వీన్ అనే మహిళ తన 18 నెలల చిన్నారి సలేహా, ఇతర బంధువులతో కలిసి కిషన్ బాగ్ పార్క్ కు వెళ్లింది. పిల్లలందరూ పార్క్ గేటు దగ్గర ఆడుకుంటున్నారు. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్న నసీమ్ బేగం అనే మహిళ తన ప్లాన్ ను వర్కౌట్ చేసింది.
ఆడుకుంటున్న చిన్నారిని తన వెంట తీసుకెళ్లింది. ఆటోలో వెళ్లి నవాబా సాహబ్ కుంటలో ఉన్న తన కుమార్తె వసీమ్ బేగంకు చిన్నారిని అప్పగించింది. ఇంతలో.. చిన్నారి సలేహా కనిపించకపోయేసరికి తల్లి పర్వీన్, ఆమె బంధువులు పార్కు మొత్తం వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కంగారు పడ్డారు.
చివరకు బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పార్కు బయట ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి.. 100 కెమెరాలను జల్లెడ పట్టి.. కిడ్నాప్ కు గురైన నాలుగు గంటల్లోనే 18 నెలల చిన్నారిని సేవ్ చేశారు.
తీగలకుంటలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఆ తర్వాత పాపను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న తల్లీ కూతుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన మహిళలు కిషన్‌బాగ్‌లో నివాసం ఉంటున్న నసీమ్ బేగం (62), నవాబాసాహబ్ కుంటలో నివాసం ఉంటున్న అయేషా బేగం అలియాస్ వసీమ్ బేగం (32)గా గుర్తించారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపర్చి.. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు.