- లబుషేన్, స్మిత్, ఖవాజ ఫిఫ్టీలు
- తొలి రోజు ఆస్ట్రేలియా 311/6
- మూడు వికెట్లతో మెరిసిన బుమ్రా
మెల్‌బోర్న్ : బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. 80 వేల పైచిలుకు ప్రేక్షకులతో కిక్కిరిసిన ఎంసీజీ స్టేడియంలో ఇండియా పేస్ లీడర్ జస్‌ప్రీత్ బుమ్రా (3/75) కీలక సమయాల్లో మ్యాజిక్ బాల్స్‌తో మెప్పించినా.. అరంగేట్రం కుర్రాడు, 19 ఏండ్ల సామ్ కాన్‌స్టస్ (65 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) సహా నలుగురు టాపార్డర్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం మొదలైన నాలుగో మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా 86 ఓవర్లలో 311/6 స్కోరుతో మొదటి రోజును ముగించింది. మార్నస్ లబుషేన్ (72), స్టీవ్ స్మిత్ (68 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజ (57) సత్తా చాటారు. వరుసగా రెండు సెంచరీలతో జోరు మీదున్న ట్రావిస్ హెడ్ (0)తో పాటు మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా సత్తా చాటాడు. ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం స్మిత్‌తో పాటు కెప్టెన్ పాట్ కమిన్స్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆసీస్‌ను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తే ఇండియాకు అంత మంచిది.
కాన్‌స్టస్ కేక.. టాపార్డర్ తడాఖా
ఈ సిరీస్ తొలి మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్–3 బ్యాటర్లంతా కలిసి 216 రన్స్ చేస్తే.. ఎంసీజీలో ఒక్క ఇన్నింగ్స్‌లోనే 192 రన్స్ రాబట్టారు. దీన్ని బట్టి బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ టాపార్డర్ ఎంత మెరుగ్గా ఆడిందో చెప్పొచ్చు. ఇందులో ఎక్కువ క్రెడిట్ కాన్‌స్టస్‌కే దక్కుతుంది. తన వయసుకు మించిన పరిణతి చూపెట్టినఈ కుర్రాడు కలల అరంగేట్రం చేశాడు. తొలి రెండు సెషన్ల ఆసీస్ బ్యాటర్ల హవా నడిస్తే తొలి సెషన్‌లో అతను అదరగొట్టాడు. బుమ్రా వేసిన ఫస్ట్ ఓవర్లో కొన్ని వదిలేసి ఖాతా తెరిచిన కాన్‌స్టస్ అతని నాలుగో ఓవర్లో రెచ్చిపోయాడు. నిర్భయంగా ఆడిన కుర్రాడు స్కూప్ షాట్‌తో ఫోర్, రివర్స్ స్కూప్‌తో 6,4 కొట్టి ఔరా అనిపించాడు.
మరో ఎండ్‌లో ఖావాజ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సపోర్ట్ ఇవ్వగా... సామ్ మాత్రం స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో మరో రెండు ఫోర్లు, సిక్సర్లు బాదిన అతను సిరాజ్ బౌలింగ్‌లో డబుల్‌తో 52 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతి బాల్‌నే బౌండ్రీకి తరలించాడు. 20వ ఓవర్లో కాన్‌స్టస్‌ను ఎల్బీ చేసిన జడేజా ఫస్ట్ వికెట్‌కు 89 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. 112/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లిన ఆసీస్ రెండో సెషన్‌లో నింపాదిగా బ్యాటింగ్ చేసింది.
ఖవాజ, వన్‌డౌన్ బ్యాటర్ లబుషేన్ ఎక్కువ డిఫెన్స్ ఆడారు. ఆకాశ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఖవాజ తర్వాత మళ్లీ నెమ్మదించాడు. మరోసారి బౌలింగ్‌కు దిగిన బుమ్రా తన ఫస్ట్ బాల్‌కే ఖవాజను ఔట్ చేసి రెండో వికెట్‌కు 65 రన్స్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. స్టీవ్ స్మిత్ కూడా ఆరంభంలో జాగ్రత్త పడటంతో ఆసీస్ రెండో సెషన్ 176/2తో ముగించింది.
బుమ్రా జోరు
మూడో సెషన్‌లో ఇండియా పుంజుకుంది. నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ జోరును అడ్డుకునే ప్రయత్నం చేసింది. బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే లబుషేన్, స్మిత్ వరుస బౌండ్రీలతో వేగం పెంచారు. ఆకాశ్ బౌలింగ్‌లో డబుల్‌తో లబుషేన్ ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు. జడ్డూ బౌలింగ్‌లో స్మిత్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. స్మిత్ ఎల్బీ కోసం ఇండియా ఓ రివ్యూ వేస్ట్ చేసింది. భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపిస్తున్న లబుషేన్ చివరకు సుందర్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ టైమ్‌లో బుమ్రా ఒక్కసారిగా విజృంభించాడు.
సూపర్ ఫామ్‌లో ఉన్న హెడ్‌ను అద్భుత బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు, బుమ్రా ఫర్‌ఫెక్ట్ లెంగ్త్‌తో వేసిన బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుందనుకొని హెడ్ పూర్తిగా వదిలేయగా.. అది ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. ఆ వెంటనే బుమ్రా బౌలింగ్‌లో పుల్ షాట్‌కు ట్రై చేసిన మిచెల్ మార్ష్ (4) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 9 రన్స్ తేడాతో మూడు వికెట్లు పడటంతో ఇండియా రేసులోకి వచ్చింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన స్మిత్‌కు తోడైన అలెక్స్ క్యారీ (31) సాధికారంగా ఆడాడు.
ఫిఫ్టీ పూర్తి చేసుకున్న వెంటనే స్మిత్ సిక్స్ కొట్టగా.. సుందర్ ఓవర్లో క్యారీ కూడా బాల్‌ను స్టాండ్స్‌కు పంపాడు. వీళ్ల జోరు చూస్తుంటే మరో వికెట్ పడకుండా రోజు ముగిసేలా కనిపించింది. కానీ, కొత్త బంతి వచ్చిన తర్వాత వేసిన తన తొలి బాల్‌కే క్యారీ ఎడ్జ్ రాబట్టిన ఆకాశ్ దీప్ కీపర్ క్యాచ్‌తో అతడిని పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి రోజు పూర్తిగా ఆసీస్‌దే పైచేయి కాకుండా చేశాడు.
బుమ్రాను బాదేశాడు..
బుమ్రా బౌలింగ్‌లో షాట్ ఆడాలంటేనే బ్యాటర్లు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది సిక్స్ కొట్టాలంటే.. చాలా ధైర్యం చేయాల్సిందే. గత ఐదేండ్ల నుంచి టెస్టుల్లో బుమ్రా బౌలింగ్‌లో ఎవ్వరూ ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. కానీ, ఆసీస్ కుర్రాడు కాన్‌స్టస్ ఒకే ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు కొట్టేశాడు. అందులో ఒకదాన్ని రివర్స్ స్కూప్‌తో కొట్టి ఔరా అనిపించాడు. బుమ్రాను ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్‌తో వచ్చిన సామ్ అతని రెండు ఓవర్లలో ఖతర్నాక్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించి పలు రికార్డులూ బ్రేక్ చేశాడు.
బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన ఫోర్‌నే స్కూప్ షాట్‌తో కీపర్ మీదుగా బౌండ్రీ చేర్చిన కాన్‌స్టస్ వెంటనే రివర్స్ స్కూప్‌తో స్లిప్స్ మీదుగా సిక్స్ కొట్టాడు. టెస్టుల్లో బుమ్రా బౌలింగ్‌లో చివరగా 2021 సిడ్నీలో కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత 4562 బాల్స్‌లో బుమ్రా ఒక్క సిక్స్ ఇవ్వని రికార్డు బ్రేక్ అయింది. మరో రివర్స్ స్కూప్‌తో ఫోర్ బాదడంతో ఆ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి.
ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బుమ్రాపై సామ్ మరోసారి విరుచుకుపడ్డాడు. ఈసారి రెండు ఫోర్లతో పాటు పవర్ ఫుల్ షాట్‌తో మిడాన్ మీదుగా సిక్స్ కొట్టాడు. రెండు డబుల్స్ కూడా తీశాడు. దాంతో తన టెస్టు కెరీర్‌లో బుమ్రా ఒక ఓవర్లో అత్యధికంగా 18 రన్స్ ఇచ్చుకున్నట్టయింది. 2020లో ఇదే గ్రౌండ్‌లో 16 రన్స్ ఇచ్చిన రికార్డు బద్దలైంది.
87,242 ఈ మ్యాచ్ తొలి రోజు ఆటకు రికార్డు స్థాయిలో 87,242 మంది ప్రేక్షకులతో ఎంసీజీ స్టేడియం నిండిపోయింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు అత్యధిక హాజరు ఇదే కావడం విశేషం.
1 టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా యంగెస్ట్ ఓపెనర్‌గా 19 ఏండ్ల 85 రోజుల కొన్‌స్టస్ రికార్డుకెక్కాడు.. మెన్స్ టెస్టుల్లో ఫిఫ్టీ చేసిన రెండో యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.
13.1 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 13.1 ఓ వర్లలోనే కాన్‌స్టస్ ఫిఫ్టీ పూర్తయింది. దాంతో టెస్టు అరంగేట్రంలో రికార్డు సమయంలో ఫిఫ్టీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 2018లో వెస్టిండీస్‌పై ఇండియా ఆటగాడు పృథ్వీ షా 17.4 ఓవర్లలో అందుకున్న ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 86 ఓవర్లలో 311/6 (లబుషేన్ 72, స్మిత్ 68 బ్యాటింగ్, కొన్‌స్టస్ 60, బుమ్రా 3/75).