- వరంగల్ 24 అంతస్తుల దవాఖానకు భూమి పూజ చేసి ఇయ్యాల్టికి సంవత్సరం
‘‘వరంగల్ సెంట్రల్ జైలు పడగొట్టి 56 ఎకరాల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకున్నాం. దీని పక్కనున్న ఎంజీఎం, ఐ హాస్పిటల్, కేఎంసీ భూములను ఇంచు.. ఇంచు కొలువాలె. దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్పిటల్ ఉండాలే. 200 ఎకరాల్లో ఈ ప్రాంతాన్ని హెల్త్ కాంప్లెక్స్ చేయాలె. రూ.2 వేల కోట్ల నుంచి 3వేల కోట్లు ఖర్చయినా పర్లేదు చూద్దాం. ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన ఒక టీం నెలలో కెనడా దేశం పోవాలె. అక్కడి 24 అంతస్తుల హాస్పిటల్ ఎలా కట్టిన్రో స్టడీ చేయాలె. ఫోటోలు, వీడియోలు తీసుకోవాలె. ఇక్కడికి వచ్చుడుతోనే టైం వేస్ట్ చేయకుండా దానిని తలదన్నేలా పనులు మొదలు పెట్టాలె. చైనాలో ఎవడో 28 గంటల్లో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టిండంటా.. అవసరమ నుకుంటే ఆ కట్టినోన్ని పట్టుకు రండి. 10 రూపాయలు ఎక్కువ ఖర్చయి నా ఫర్వాలేదు. ఏడాదిన్నరలో సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్ కట్టుడు పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకోవాలి. మళ్లీ నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తా..” - గతేడాది జూన్ 21న హాస్పిటల్ భూమిపూజ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి.
వరంగల్, వెలుగు: వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ లెవెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు సీఎం శంకుస్థాపన చేసి నేటికి ఏడాది. ఇంకా పునాదులు కూడా దాటలేదు. గతేడాది జూన్ 21న సీఎం కేసీఆర్ హాస్పిటల్‌కు భూమిపూజ చేసి, అనంతరం హనుమకొండ కలెక్టరేట్‍లో మాట్లాడారు. చైనా టెక్నాలజీ లేదంటే అంతకంటే బెస్ట్ఏదైనా ఉపయోగించి ఏడాదిన్నరలో హాస్పిటల్ కట్టుడు పూర్తి చేస్తామని మాటిచ్చారు. కానీ ఆ స్థాయిలో ఒక్కరోజు కూడా పనులు జరగలేదు. వందల ఏండ్ల నాటి సెంట్రల్ జైలును కూల్చినంత స్పీడు.. హాస్పిటల్కట్టుడులో కనిపించట్లేదు. పైగా “నేను ఒక సీఎం స్థాయిలో జిల్లాలకు పలు ప్రాజెక్టులు మంజూరు చేస్తా. వాటిని దగ్గరుండి చేపించుకోవాల్సింది మాత్రం లోకల్ మినిస్టర్లు, ఎమ్మెల్యేనని’’ పక్కనే ఉన్న జిల్లాలోని లీడర్లకు చెప్పారు. త్వరలోనే మామునూరు ఎయిర్‍పోర్ట్ రీఓపెన్, ఎంజీఎం స్థానంలో అధునాతన హాస్పిటల్, కొత్త సెంట్రల్ జైల్ నిర్మాణం, డెంటల్ కాలేజీ, హాస్పిటల్, వెటర్నరీ కాలేజీ, కొత్త కలెక్టరేట్ బిల్డింగ్పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో ఏ ఒక్క హామీ అమలు కాలేదు.
అంతా పరిశీలిస్తున్నారంతే..
సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు వైద్య శాఖ మంత్రి మినిస్టర్తన్నీరు హరీశ్‌రావు కొన్ని నెలలుగా చెబుతున్నారు. మే మొదటి వారంలో వరంగల్ పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్‍తో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించారు. తర్వాత హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లతో వరంగల్‌లో 2 వేల బెడ్లతో హాస్పిటల్ నిర్మిస్తుందని, త్వరలోనే హెల్త్సిటీని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నెలకు నాలుగు ఫ్లోర్లు స్లాబ్‍లు పడేలా చూస్తామన్నారు. ఏడాదిలో హాస్పిటల్ కట్టుడు పూర్తిచేసి.. మరో ఆరు నెలల్లో కావాల్సిన స్టాఫ్ రిక్రూట్‍మెంట్, ఎక్విప్‍మెంట్ అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నరలో పేషెంట్లకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని మాటిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఏడాదిలో కనీసం పునాదులు దాటలేదు. హాస్పిటల్ డిజైన్ గీయడం, టెండర్లు పిలవడం, కాంట్రాక్ట్అప్పజెప్పడానికే సంవత్సరం అయిపోయింది. కనీసం పిల్లర్లు కూడా పడలేదు.
అన్నీ పెండింగే
హాస్పిటల్ శంకుస్థాపన మీటింగ్‍లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందన్నారు. ఏడాదిలోపే మామునూరు ఎయిర్‍పోర్టు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి పనులు వేగవంతం చేస్తామన్నారు. ఏడాదిగా ఈ హామీ కూడా అమలు కాలేదు. ఇక మామునూరు బెటాలియన్ స్థలంలో చర్లపల్లి జైలును తలదన్నేలా కొత్త ఓపెన్ జైల్ నిర్మిస్తామన్నారు. ఇదీ అతీగతిలేదు. ఇదే మీటింగ్‍లో హనుమకొండ, వరంగల్ జిల్లాలను విభజించే ప్రకటన చేసిన సీఎం వరంగల్ జిల్లాకు కొత్త కలెక్టరేట్ కడుతామన్నారు. ఇది కూడా ఇంకా పెండింగులోనే ఉంది. డెంటల్ హాస్పిటల్ కమ్ కాలేజీ నిర్మాణం భూములు చూసే దగ్గరే ఉంది. మొత్తంగా సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చిన పనులు ఏడాది తర్వాత కూడా ఇంచు కదలలేదు.