సర్కారు తప్పుడు విధానాలతోనే మద్యానికి జనం బలవుతున్నరు : ఎం. పద్మనాభ రెడ్డి

సర్కారు తప్పుడు విధానాలతోనే మద్యానికి జనం బలవుతున్నరు : ఎం. పద్మనాభ రెడ్డి

ప్రజల ఆరోగ్యానికి హానికరమైన మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల వాడకంపై నిషేధం విధించాలని భారత రాజ్యాంగలోని 47వ అనుకరణ నిర్దేశించింది. 

స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలా రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులోకి వచ్చింది. అయితే అమలులో ఇబ్బందులు, కల్తీ మత్తు పానీయాలు మార్కెట్లోకి ప్రవేశించడం, ఇక రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం చూపడం వంటి కారణాలతో చాలా రాష్ట్రాల్లో మద్య నిషేధం ఎత్తేశారు. గుజరాత్ రాష్ట్రంలో కొన్ని సడలింపులతో మద్య నిషేధం అమలులో ఉంది. తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లో మొదట్లో మద్య నిషేధం ఉన్నా తరువాత ఎత్తేశారు. ఈత, తాడి చెట్ల నుంచి తీసే పానీయాన్ని కల్లు, బ్రాందీ, విస్కీ వంటి వాటిని ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్అని, గంజాయి, కొకైన్ వంటి వాటిని మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తారు. కొంతకాలం క్రితం వరకు గ్రామాల్లో కల్లు తాగేవారు. వ్యవసాయం విస్తరించడంతో ఈత, తాటి చెట్లు బాగా తగ్గిపోయాయి. జనాభా పెరుగుదలతో కల్లు తాగేవారి సంఖ్య పెరగడం, మరోవైపు ఈత, తాటి చెట్ల సంఖ్య తగ్గడంతో స్వచ్ఛమైన కల్లు లభ్యత బాగా తగ్గింది. దాంతో కల్తీ కల్లు మార్కెట్లోకి ప్రవేశించింది. కల్తీ కల్లు విపరీతంగా మార్కెట్లో అమ్ముతున్నారు. 2004 సంవత్సరంలో మొదటగా ప్రభుత్వం ఈ సమస్య తీవ్రతను గుర్తించి కల్లు దుకాణాలకు50 కిలోమీటర్లలోపు తాటి, ఈత చెట్లు ఉన్నప్పుడే కల్లు దుకాణాలు కల్లు అమ్మాలనే ఓ పాలసీ తీసుకువచ్చింది. హైదరాబాదు నగరానికి చుట్టు పక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఈత, తాటి చెట్లు లేక పోవడంతో హైదరాబాదు నగరంలో 2004 నుంచి కల్లు దుకాణాలు మూత పడ్డాయి.

నాలుగింతలు పెరిగిన మద్యం ఆదాయం

కల్లులో ఎంత శాతం ఆల్కహాల్ ఉందని కేరళ ప్రభుత్వం పరీక్షలు జరుపగా 8.1 శాతం ఉందని తేలింది. అందుకే దాన్ని లిక్కర్(మత్తు పానీయం)గా పరిగణిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ చట్టం సెక్షన్ 21 (ఎ) ప్రకారం కల్లు మత్తు పానీయంగా పరిగణిస్తారు. మామూలు బీరులో 5 శాతం మాత్రమే ఆల్కహాలు ఉండగా కల్లులో మాత్రం8.1% ఆల్కహాలు ఉంది. కల్తీ కల్లులో 100% ఆరోగ్యానికి హానికరమైన రసాయన పదార్థాలు ఉంటాయి. 2004 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో కల్లు దుకాణాలు మూసివేయడానికి గల కారణాలు తెలుపుతూ ప్రభుత్వం సాలీన సుమారు 50 మంది వరకు ప్రజలు కల్తీకల్లు బారిన పడి చనిపోతున్నారని హైకోర్టుకు తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్తీకల్లు తాగి చనిపోతున్న వారి గణాంకాలు ఆబ్కారీశాఖ వారు నమోదు చేయడం లేదు. దాంతో అంతా సవ్యంగా జరుగుతోందనే భావన కలుగజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్సైజ్(ఆబ్కారీ) శాఖ ఆదాయం కేవలం రూ. 8 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.30 వేల కోట్లు దాటింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల్లో మద్యం తాగే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహా నగరంలో మాదక ద్రవ్యాల వాడకం కూడా పెరిగిపోతున్నది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను చాక్లెట్ల రూపంలో అమ్మడం వంటి వార్తలు బయటకు వచ్చాయి. ప్రజలు విస్కీలు, బ్రాందీలతో మత్తు రాకపోవడంతో మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల వాడకంలో ముందు వరుసలో ఉండటం ఆందోళనకరం. దీనిపై పాలకులు, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..

తమిళనాడు రాష్ట్రంలో తాటిచెట్టును రాష్ట్ర వృక్షంగా గుర్తిస్తారు. అయినా అక్కడ కల్లు అమ్మడం నిషేధించారు. చెట్ల నుంచి తీసిన కల్లును గీత కార్మికులు బెల్లంగా తయారు చేసి అమ్ముతారు. దీంతో వారికి ఉపాధి దొరుకుతున్నది. కల్లు అమ్మకంలో కంటే బెల్లం అమ్మకంలో లాభం ఎక్కువగా ఉంది. ఆబ్కారీ అధికారులు మత్తు పానీయాల అమ్మకంలో పోటీ పడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కేవలం ఆదాయమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు కొన్ని విషయాలను తీసుకువస్తున్నది. వీటిపై సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

* 50 కి.మీ లోపు ఈత, తాటి చెట్లు లేని ప్రాంతాల్లో కల్లు దుకాణాలను మూసివేయాలి.

* కల్తీ కల్లు తయారీ, అమ్మకంపై గట్టి నిఘా పెట్టి కల్తీ కల్లు అమ్మకం ఆపివేయాలి. 

* గ్రామ గ్రామాన, వాడ వాడల వెలసిన బెల్టు షాపులపై నియంత్రణ విధించాలి.

* తాటికల్లు బెల్లంగా చేసే విధంగా చర్యలు తీసుకొని గీత పని వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలి. 

* తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం పెరిగిపోతున్నది. పిల్లలు కూడా చాక్లెట్ల రూపంలో ఈ వ్యసనానికి గురవుతున్నారు. మాదక ద్రవ్యాల వలన, కల్తీ కల్లు తాగడం వల్ల జరిగే హానిని పెద్ద ఎత్తున రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన పరచాలి.

* రాష్ట్ర ఆబ్కారీ శాఖ కేవలం సర్కారు ఆదాయాన్ని పెంచేందుకే పనిచేస్తున్నది. అలా కాకుండా మధ్య నిషేధంపై దృష్టి పెట్టి తగిన చర్యలు 
తీసుకోవాలి.

ప్రతి వైన్​షాపుకు పదుల సంఖ్యలో బెల్టు షాపులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాదు నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ సుమారు100 వరకు కల్లు దుకాణాలు ప్రారంభమయ్యాయి. వీటిల్లో కల్తీ కల్లు అమ్మకాలు విచ్చల విడిగా జరుగుతున్నాయి. పేద ప్రజలు ముఖ్యంగా కూలి, నాలి చేసుకునేవారు ఈ కల్తీ కల్లుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. క్లోరల్ హైడ్రేట్, డైజోపామ్ వంటి రసాయనాలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ రసాయనాలు కలిపి కల్తీ కల్లు తయారు చేస్తున్నా, కల్తీని నిరోధించే ఎక్సైజ్ శాఖ వారు కండ్లు మూసుకుంటున్నారు. బీరు, విస్కీ, బ్రాందీల విషయంలో ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన స్థలాల్లో అమ్మడానికి పెద్ద మొత్తంలో రుసుం తీసుకొని అనుమతి ఇస్తున్నది. ఇలా నిర్ణయించిన ప్రదేశాల్లో తప్ప ఇతర స్థలాల్లో మద్యం అమ్మడానికి వీలు లేదు. రాష్ట్రంలో సుమారు 2600 దుకాణాలను ప్రభుత్వం వేలం వేసింది. అయితే గ్రామీణ, మండల స్థాయిలో ప్రతి దుకాణానికి అక్రమంగా పది వరకు బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పల్లె పల్లెన బీరు, విస్కీ సులభంగా దొరుకుతున్నాయి. ఈ తతంగమంతా ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే నడుస్తున్నది. మత్తు పానీయాలు ప్రతి గ్రామం, ప్రతి గల్లీలో దొరుకుతుండటంతో ప్రజలు ముఖ్యంగా యవకులు, పురుషులు మద్యానికి బానిసలవుతున్నారు.  సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే డబ్బు మద్యం అమ్మకాల ద్వారా తిరిగి ప్రభుత్వానికే చేరుతున్నది.

- ఎం. పద్మనాభ రెడ్డి, ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్