97 ఏండ్ల వయసులో తన రికార్డు తానే తిరగరాశాడు.. ఎవరీయన ? అంటారా.. అయితే ఈ స్టోరీ చదవండి

97 ఏండ్ల వయసులో తన రికార్డు తానే తిరగరాశాడు.. ఎవరీయన ? అంటారా.. అయితే ఈ స్టోరీ చదవండి

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమంటే మాటలు కాదు. దానికి ఎంతో శ్రమ, నిరంతర కృషి, పట్టుదల ఉండాలి. సాధించాలనే తపనతో పనిచేయాలి. అప్పుడే రికార్డు దక్కుతుంది. అలాంటిది ఆల్రెడీ రికార్డ్ సృష్టించి, తిరిగి తానే దాన్ని బద్దలు కొడితే.. ఇది చాలామందికి అసాధ్యం కావొచ్చు. కానీ, ఫాబియో సబ్బియొని లాంటివాళ్లకు కాదు. ఎవరీయన? అంటారా.. అయితే ఈ స్టోరీ చదవండి.

97 ఏండ్ల వయసులో తన రికార్డు తానే తిరగరాశాడు ఫాబియో. ఇటలీలోని టుస్కనీకి దగ్గరలో ఉన్న చారిత్రక పట్టణంలో నివసిస్తున్నాడు. తన రిటైర్​మెంట్​ తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంతమైన లైఫ్​ గడిపేందుకు వెళ్లాడట. కానీ, అక్కడికి వెళ్లాక ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా పనిచేస్తున్నాడు ఫాబియో. విరిగిపోయిన కార్లు ఫిక్స్ చేయడం, ట్రక్ ఇంజిన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడం వంటివి చేస్తుంటాడు. దాంతోపాటు ఆటో గ్యారేజీని కూడా నడుపుతున్నాడు. అప్పుడప్పుడు మెకానిక్​గా రోడ్​ సైడ్​ వెహికల్స్​కి అసిస్టెంట్​ సర్వీస్​లు కూడా చేస్తుంటాడు. మరో మూడేండ్లలో ఆయన వయసు వందకు చేరుకుంటుంది. 

రెండో ప్రపంచ యుద్ధం ప్రభావంతో ఇటలీలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. నిరుద్యోగులు ఎక్కువైపోయారు.  ఫాబియో 1946లో పని వెతుక్కుంటూ అరెజ్జో అనే ఊరికి వెళ్లాడు. అప్పుడు ఆయన వయసు 19 ఏండ్లు. ఆ టైంలో ఇటాలియన్ ఫాబియో ఫ్రెండ్స్ స్థాపించిన కంపెనీ సక్సెస్​ఫుల్​గా సాగుతోంది. వాళ్లు ఫాబియోకి ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే జాబ్​ వెతకడం ఈజీ అవుతుంది అని. దాంతో ఆయన వెంటనే డ్రైవింగ్ స్కూల్లో చేరాడు. తర్వాత మెకానిక్​ షాప్​లో పనిచేశాడు. 1958లో పార్ట్​నర్​తో కలిసి ఒక మెకానిక్​ షాప్​ కొన్నాడు.  

అది నడిపిస్తున్నప్పుడే 1965లో రోడ్ సైడ్ అసిస్టెంట్ సర్వీస్​ చేసే అవకాశం వచ్చింది. 1979లో ఆటో గ్యారేజీ, వర్క్​షాప్​లు రెండు సర్వీస్​లు చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాడు ఫాబియో. అందుకే ‘‘ఓల్డెస్ట్​ కార్ మెకానిక్​’’గా 2022లో గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ సొంతం అయింది. అయితే 97 ఏండ్ల వయసులో కూడా పని చేస్తూ 2024లో తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ‘‘రిటైర్​ అవ్వాలనుకున్నప్పుడే అవుతా. అంతవరకు పనిచేస్తూనే ఉంటా. నిజానికి ఈ వయసులో కూడా పనిచేస్తానని ఎప్పుడూ ఊహించలేదు’’ అంటాడు ఫాబియో.