
హనుమకొండ : పోలీసులు చిత్రహింసలు పెట్టారని జడ్జీ ముందు ఏబీవీపీ విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో రెండోసారి వైద్యపరీక్షలకు న్యాయమూర్తి ఆదేశించారు. కేయూ పోలీసులను బాధ్యత నుంచి తప్పించి సుబేదారి పోలీసులకు బాధ్యతలు అప్పగించారు న్యాయమూర్తి.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏబీవీపీ విద్యార్థులు చికిత్స పొందిన అనంతరం సుబేదారి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ 5వ తేదీ కేయూలో ఆందోళన చేసిన ఏబీవీపీ నేతలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి.. తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
పీహెచ్‌డీ కేటగిరీ-2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ వరంగల్ కేయూలో సెప్టెంబర్ 5వ తేదీ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కంప్యూటర్, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. కంప్యూటర్లను విద్యార్థులే ధ్వంసం చేశారని పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని రాత్రి స్టే షన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్ లో తమను విచక్షణారహితంగా కొట్టారని విద్యార్థి నేతలు న్యాయమూర్తి ఎదుట వాపోయారు. విద్యార్థి నేతల వాంగ్మూలం తీసుకున్న జడ్జి.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించి వైద్య పరీక్షలు మరోసారి నిర్వహించాలని ఆదేశించారు.