భూమి రిజిస్ట్రేషన్ ​చేస్తలేడని చంపేసిండు

భూమి రిజిస్ట్రేషన్ ​చేస్తలేడని చంపేసిండు

మంచిర్యాల రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఇద్దరి అరెస్ట్​

కోల్​బెల్ట్ , వెలుగు : మంచిర్యాలకు చెందిన రియల్​ ఎస్టేట్ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతారావును హత్య చేసిన నిందితులు మామిడి శ్రీనివాస్​, దాసరి శ్రీనివాస్​ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల డీసీపీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచిర్యాల డీసీపీ, ఐపీఎస్​ ఆఫీసర్​ రామనాథ్​ కేకన్​, బెల్లంపల్లి ఏసీపీ పంతటి సదయ్య వివరాలు వెల్లడించారు.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కొండాపూర్​కు చెందిన మామిడి శ్రీనివాస్​ రెండేళ్లుగా నస్పూర్​లో ఉంటూ మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు.  

మంచిర్యాలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతారావు, అతడి భార్య పద్మ, మరో నలుగురు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం నస్పూర్​ మండలం తీగల్​పహాడ్ సీసీసీ ఏరియాలో  2019లో 5.21 ఎకరాల భూమి కొన్నారు. ఏడాదిన్నర కింద ఈ భూమిని మామిడి శ్రీనివాస్  కొని  అగ్రిమెంట్​ చేసుకొని లక్ష్మీకాంతారావుకు రూ.30లక్షలు ఇచ్చాడు.  భూమి రిజిస్ర్టేషన్​ చేయించాలని శ్రీనివాస్ అడిగిన ప్రతీసారి లక్ష్మీకాంతారావు వాయిదా వేస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. రిజిస్ర్టేషన్​కు మిగిలినవాళ్లు ఒప్పుకున్నా లక్ష్మీకాంతారావు సహకరించడంలేదని, అతన్ని చంపితేనే సమస్య పరిష్కారమవుతుందని భావించిన మామిడి శ్రీనివాస్​, తన స్నేహితుడైన కాగజ్​నగర్​కు చెందిన దాసరి శ్రీనివాస్​ సహాయం కోరాడు.  

ఇందుకు కొంత డబ్బు ఇస్తానని చెప్పడంతో దాసరి శ్రీనివాస్​ ఒప్పుకున్నాడు.  ఈ క్రమంలో ఈనెల 11న మందమర్రి మండలం గద్దెరాగడిలోని తనకు చెందిన భూమిలో ఎవరో ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారని, అక్కడికి వెళ్లి సెంట్రింగ్​ కూలగొడితే  భూమి రిజిస్ర్టేషన్​ చేస్తానని లక్ష్మీకాంతారావు మామిడి శ్రీనివాస్​కు చెప్పాడు.  దీంతో  స్నేహితుడైన దాసరి శ్రీనివాస్​ను వెంటపెట్టుకొని  బైక్​పై గద్దెరాగడి గ్రామం వెళ్లి అక్కడ కడుతున్న ఇంటి సెంట్రింగ్​ను కూలగొట్టి లక్ష్మీకాంతారావుకు సమాచారం అందించాడు. రిజిస్ర్టేషన్​పై మళ్లీ దాటవేసే ప్రయత్నాలు చేయడంతో కోపం పెంచుకున్న మామిడి శ్రీనివాస్​ లక్ష్మీకాంతారావును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని గద్దెరాగడి వస్తే మాట్లాడుకుందామంటూ పిలిచాడు. ప్లాన్​ ప్రకారం నిందితులు  ముందుగానే కత్తిని తీసుకొచ్చి ఖాళీగా ఉన్న షెడ్​లో దాచి ఉంచారు.

 లక్ష్మీకాంతారావు రాగానే భూమి రిజిస్ర్టేషన్​ విషయంపై  మామిడి శ్రీనివాస్ గొడవపడుతుండగా దాసరి శ్రీనివాస్​ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా కాపలా కాశాడు. కోపంతో మామిడి  శ్రీనివాస్​ వెంట తెచ్చుకున్న కత్తితో లక్ష్మీకాంతారావు తల, ముఖంపై దాడి చేసి చంపాడు. అనంతరం బైక్​పై ఇద్దరు పరారయ్యారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​ పంపి వారి నుంచి హత్యకు వాడిన కత్తి, బైక్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.