నకిలీ మద్యం కేసులో పరారీలో ఉన్న నిందితుడు కొండల్ రెడ్డి అలియాస్ శివారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడులు మూడు కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. ఒడిశాలోని కటక్ లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించారు. కోటి రూపాయలు విలువైన 20 వేల లీటర్ల నకిలీ విస్కీని సీజ్ చేశారు. ఒడిశా లో తయారుచేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో ఓ ముఠా నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణ నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి, భారీగా నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు.
ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు మరో నలుగురు పరారీలో ఉండగా ..వారిలో ప్రధాన నిందితుడైన కోండల్ రెడ్డి, నాగేశ్వర రావుని అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు.ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కేటుగాళ్లు తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్ని సరఫరా చేశారు. ఎక్సైజ్ పోలీసులు ఒడిశాలో ఉన్న నకిలీ మద్యం స్థావరంపై దాడులు చేసి ధ్వంసం చేశారు.ఈ కేసులో నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీసుల అదుపులో ఉన్న కొండల్ రెడ్డి స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆసుపత్రి వైద్యులు కొండల్ రెడ్డికి మెరుగైన వైద్యం అవసరమని సూచించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.