ప్రీతి మరణం వెనక మిస్టరీ ఉందని.. ఆత్మహత్య కాదంటూ సోదరుడు పృథ్వీ చేస్తున్న ఆరోపణల క్రమంలోనే.. నిందితుడు సైఫ్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ.. కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాలతో.. సైఫ్ ను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా.. నాలుగు రోజుల కస్టడీకి.. ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా జైలు నుంచి సైఫ్ ను మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇక్కడే సైఫ్ ను విచారిస్తున్నారు. మార్చి 2వ తేదీ నుంచి నాలుగు రోజులు సైఫ్ ను పోలీసులు అన్ని కోణాల్లో విచారించనున్నారు.
ప్రీతి సోదరుడు సంచలన వ్యాఖ్యలు
ప్రీతి మృతిపై ఆమె సోదరుడు పృథ్వీ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి లో తమ సోదరికి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని, అది ఎందుకు చేశారో తమకు తెలియదన్నాడు. ప్రీతికి పూర్తిగా శరీరంలో వైద్యులు బ్లడ్ డయాలిసిస్ చేశారని అనుమానం వ్యక్తం చేశాడు. ప్రీతి బాడీలో ఉన్న ఇంజెక్షన్ గురించి పోస్ట్మార్టంలో ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు. నిమ్స్ లో తన సోదరికి ఏం వైద్యం చేశారో చెప్పాలని డిమాండ్ చేశాడు. నిమ్స్ లో జరిగిన వైద్యంపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పాడు.
ఇక ర్యాగింగ్ కమిటీపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పాడు ప్రీతి సోదరుడు పృథ్వీ. తప్పు చేసిన HOD నాగార్జున రెడ్డిని కమిటీలో ఎలా ఉంచుతారని ప్రశ్నించాడు. ప్రీతి ఫోన్ లో ప్రతి ఒక్క మెసేజ్ తాను చెక్ చేశానని చెప్పిన పృథ్వీ.. తనకు కనిపించని మెసేజులు పోలీసులకు ఎలా కనిపించాయని అనుమానం వ్యక్తం చేశాడు. కమిటీ రిపోర్ట్ ను నాగార్జున రెడ్డి మార్చి ఉంటారని ఆరోపించాడు. తమకు న్యాయం జరగాలని పృథ్వీ డిమాండ్ చేస్తున్నాడు.