వరంగల్ : మెడికో పీజీ విద్యార్థినీ ప్రీతి ఆత్మహత్య కేసులో రెండో రోజు నిందితుడు సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు. కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. ప్రీతితో ఉన్న గొడవలు, ఆమెను వేధింపులకు గురి చేయడానికి గల కారణాలను మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఛార్జ్ షీట్ లో పేర్కొన అంశాలు, టెక్నికల్ ఎవిడెన్స్ పై విచారిస్తున్నారు. మార్చి 2న వరంగల్ పోలీసులు.. ఖమ్మం జిల్లా జైలు నుంచి మట్టెవాడ పోలీస్ స్టేషన్ లోని ఏసీపీ ఆఫీస్ కు సైఫ్ ను తీసుకొచ్చారు. నిన్న పలు ప్రశ్నలు సంధించారు. మరోవైపు.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో ఫిబ్రవరి 28న సైఫ్ పిటిషన్ వేయగా.. ఇంకా విచారణ జరగలేదు.
ఇటు.. ప్రీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజీఎం అనస్థీషియా డిపార్ట్ మెంట్ HOD, డాక్టర్ నాగార్జునరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నాగార్జునరెడ్డిని భూపాలపల్లి ప్రభుత్వ వైద్యకళాశాలకు బదిలీ చేసింది. డాక్టర్ సైఫ్ వేధింపులపై ప్రీతి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయగా.. ఆయన సూచన మేరకు సైఫ్.. ప్రీతిని పిలిచి నాగార్జునరెడ్డి మాట్లాడారు. సైఫ్ విషయం నేరుగా తనకు చెప్పకుండా..ప్రిన్సిపాల్ కు చెప్పడంపై నాగార్జున రెడ్డి ప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రీతి మరింత కుంగిపోయిందని, నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రీతి తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నాగార్జున రెడ్డిని బదిలీ చేశారు.