అప్సర కేసు : అర్థరాత్రి సీన్.. రీ కన్ స్ట్రక్షన్

తెలంగాణలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి వెంకట సూర్య సాయికృష్ణను శుక్రవారం (జూన్ 16వ తేదీన) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాలతో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు అన్ని కోణాల్లోనూ మరోసారి విచారించనున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత అప్సరను హత్య చేసిన నర్కూడలోని గోశాల వద్దకు తీసుకెళ్లారు శంషాబాద్ రూరల్ పోలీసులు.

హత్య జరిగిన ప్రాంతంలో సాయికృష్ణతో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు పోలీసులు. దీని ద్వారా అప్సర హత్యకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఆ తర్వాత నిందితుడు సాయికృష్ణను సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ లో భాగంగా సరూర్ నగర్ లో అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి తీసుకువచ్చారు. మరోవైపు.. శనివారం (జూన్ 17వ తేదీ) మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.

అప్సరతో సాయికృష్ణకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూసాయికృష్ణపై ఒత్తిడి తెచ్చింది. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో అప్సరను సాయికృష్ణ హతమార్చాడు. మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేసి పూడ్చేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాయికృష్ణే నిందితుడని గుర్తించిన విషయం తెలిసిందే.