- ఇంకో నలుగురి కోసం చోరీలు
- కామారెడ్డి పోలీసులకు చిక్కిన నిందితుడు
కామారెడ్డి, వెలుగు : మహారాష్ర్టకు చెందిన ఓ వ్యక్తికి ఐదుగురు ఆడపిల్లలున్నారు. అయితే చేసే పనికి వచ్చే జీతం సరిపోక..ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. దీంతో బిడ్డల పెండ్లిళ్లు చేసేదెట్లా అని రంది పెట్టుకున్నాడు. దొంగతనాలే మార్గమని భావించాడు. అయితే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కామారెడ్డి ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం..మహారాష్ర్టలోని నాందేడ్ జిల్లా ఖందర్ తాలుకాలోని కౌటకు చెందిన రాజు విశ్వనాథ్ ఒగ్లే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టౌన్‌లోని చైతన్య కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో కొంతకాలంగా వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇదే అపార్ట్మెంట్లో ఉండే బచ్చు భుజేందర్ఈనెల 10న తన ఇంటికి తాళం వేసి నిజామాబాద్ వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన విశ్వనాథ్ తాళం పగుల గొట్టి నగలు, డబ్బు దొంగతనం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిఘా పెట్టారు. గురువారం ఆ నగలను అమ్మేందుకు వెళ్లిన రాజు విశ్వనాథ్ ఒగ్లెను అరెస్టు చేసి రూ. 20 లక్షల విలువైన 41 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణలో విశ్వనాథ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ఐదుగురు బిడ్డలు ఉన్నారని, పెద్ద బిడ్డ పెండ్లి చేయగా ఇంకా నలుగురు బిడ్డల పెండ్లి చేయాల్సి ఉండటంతో ఇలా దొంగతనాల బాట పట్టానని చెప్పాడు. డీఎస్పీ జగన్నాథరెడ్డి, టౌన్ సీఐ ఉరేందర్రెడ్డి ఉన్నారు.