తండ్రిని చంపేస్తానని బెదిరించి బాలికపై అత్యాచారం

తండ్రిని చంపేస్తానని బెదిరించి బాలికపై అత్యాచారం
  • నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

కంటోన్మెంట్, వెలుగు : తనతో శారీక సంబంధం పెట్టుకోకుంటే, తన తండ్రిని చంపేస్తానంటూ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కీచకుడికి నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లికి చెందిన బొగ్గుల సాయిలు ఉపాధి కోసం సిటీకి వలస వచ్చాడు. కంటోన్మెంట్​సింధీకాలనీలోని ఓ ఫంక్షన్​లో బాలిక తండ్రితో కలిసి పనిచేస్తున్నాడు. బాలిక కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకొని, తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. తనతో శారీక సంబంధం పెట్టుకోవాలని, లేదంటే ఆమె తండ్రిని చంపేస్తానంటూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అయితే, తన తండ్రిని చంపుతానని సాయిలు బెదిరించడంతో బాధిత బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. 2020లో బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు స్థానిక హాస్పిటల్​కు తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. బాలికను నాలుగు నెలల గర్భిణిగా నిర్ధారించారు. దీంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా, జరిగిందంతా చెప్పింది.

ఈ మేరకు బోయిన్​పల్లి పోలీసులకు కేసు నమోదు చేసి, సాయిలును రిమాండ్​కు తరలించారు.  కేసు పూర్వాపరాలు పరిశీలించిన నాంపల్లి 12వ మెట్రోపాలిటన్​ కోర్టు న్యాయమూర్తి టి. అనిత బుధవారం తీర్పును వెలువరించారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.7లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

మరో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

మల్కాజిగిరి :  మరో కేసులో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి మల్కాజిగిరి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మౌలాలీ తూర్పు ప్రగతినగర్​కు చెందిన కావలి వెంకటేశ్​(34) ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2017లో తన ఇంటి సమీపంలో ఉంటున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మల్కాజిగిరి కోర్టులో చార్జ్​షీట్ దాఖలు చేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఐదేళ్ల కారాగార శిక్షతోపాటు  రూ.5 వేల జరిమానా విధిస్తూ  బుధవారం తీర్పు వెలువరించారు.