నిజాం రాష్ట్ర దళితోద్యమానికి నాయకత్రయంగా భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్.వెంకటరావులను పేర్కొనవచ్చు. నిజాం రాజ్యంలో జాగీర్దార్లు, జమీందారులు, దేశ్‌ముఖ్ లు, దేశ్‌పాండేలు తమ ప్రాంతాల్లో విస్తృతమైన అధికారాలు చెలాయించేవారు. సమాజంలో వెట్టిచాకిరీ, అస్పృశ్యత, దేవదాసీ వ్యవస్థ, బాల్య వివాహాలు తదితర అనేక సమస్యలు ఉండేవి. పల్లెల్లో దళిత శ్రామిక స్త్రీల పరిస్థితి దారుణంగా ఉండేది. తరతరాలుగా దళిత స్త్రీలపై అమలు చేస్తున్న జోగిని వ్యవస్థ దేవుడి పేరిట స్త్రీలపై జరిగే అగ్రకుల దౌర్జన్యానికి పరాకాష్ట. అంతేకాకుండా అనేక మూఢాచారాలు పల్లెల్లో ప్రబలంగా ఉండేవి.
మహిళా వ్యవసాయ కూలీలపై లైంగిక దోపిడీ భూస్వామ్య విధానంలో భాగమై ఉండేది. సమాజం పట్ల వివక్షతకు వ్యతిరేకంగా ఆర్యసమాజ్, ఆంధ్ర మహాసభలు తమ వంతు కృషిచేశాయి. ఆర్య సమాజ్ బలవంతంగా దళితులను ఇస్లాంలోకి మార్పిడిని నిలువరించి శుద్ధి కార్యక్రమాల ద్వారా తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చారు. 1917, విజయవాడలో జరిగిన ప్రథమ ప్రాదేశిక పంచమ సదస్సులో భాగ్యరెడ్డి వర్మ పంచమ అనే పదాన్ని తిరస్కరించాలని కోరాడు.
ఫలితంగా ఆ సదస్సును ఆది ఆంధ్ర ప్రథమ సమావేశంగా ప్రకటించారు. ఈ సదస్సులో భాగ్యరెడ్డి వర్మ దళితులు భారతదేశ మూల వారసులని, వారి ఆది ఆంధ్రులు లేదా ఆది హిందువులుగా పిలవాలని వర్మ పేర్కొన్నారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో ఆది హిందూ ఉద్యమం, ఆంధ్రలో ఆది ఆంధ్రోద్యమం పేరుతో ఆది హిందూ ఉద్యమం ప్రారంభమైంది. భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రలో ఆది ఆంధ్ర ఉద్యమం పేరుతో ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ లైబ్రరీని స్థాపించారు.
పంచమ పదం తొలగింపు
భాగ్యరెడ్డి వర్మ హిందువుల్లో దళితులు భాగం కాదని భావించారు. ఈయన నిరంతర కృషికి మద్రాస్ ప్రభుత్వం స్పందించి 1922, మార్చి 25న జీవో 817ను విడుదల చేసింది. మద్రాస్ శాసన మండలి తీర్మానం చేస్తూ దక్షిణ భారతాన నివసించే ప్రాచీన జాతులు, పంచమ, పరములుగా పిలవడం మానేయాలని, ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని, మద్రాస్ ప్రాంతాల్లో ఆది ద్రావిడ, తెలుగు ప్రాంతాల్లో ఆది ఆంధ్రులుగా పిలవాలని స్పష్టం చేసింది. భాగ్యరెడ్డి వర్మ కృషి వల్ల నిజాం ప్రభుత్వంలో 1931 జనాభా లెక్కల్లో తొలిసారిగా అంటరాని వర్గాల (మాదిగ, మాల, థేర, చమార్)ను ఆది హిందువులుగా పేర్కొంది.
సంస్థల ఏర్పాటు
భాగ్యరెడ్డి వర్మ దళితులతోపాటు బహుజనులను కలుపుకునే ప్రథమ ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా సింగం సీతారాం ఆధ్వర్యంలో యాదవ సంఘం, దుర్గయ్య అధ్యక్షతన శబరి సంఘం, హనుమాన్సింగ్ అధ్యక్షతన పార్వీ సంఘాలను ఏర్పాటు చేశాడు. భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో 1925లో ఆది హిందూ సభ జరిగింది. ఈ సభకు సుబేదారు సాయన్న అధ్యక్షత వహించాడు. 1925లో భాగ్యరెడ్డి వర్మ గుంటిమల్ల రామప్ప ఆధ్వర్యంలో మాతంగి(మాదిగ) జనసభ ఏర్పాటు చేశాడు. 1927, మార్చిలో మల్లేపల్లిలో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన మాతంగి సభ జరిగింది.
ఈ సభలో కల్లు, సారాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మాదిగల హక్కుల సాధనకు సికింద్రాబాద్ కేంద్రంగా ఎన్ఆర్ బాబయ్య ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. 1930 దశాబ్దంలో మాదిగ కులస్తులు సుబేదారు సాయన్న, సుంకం అచ్చులు తదితరుల నాయకత్వంలో అరుంధతీయ మహాసభ ఏర్పడింది. అరుంధతీయుల్లో చైతన్యం కోసం 1937లో జాంబవర్ణ సేవా సమితి ఏర్పడింది. ఇది దళితుల అభ్యున్నతికి పాటుపడింది. 1931, జులై 10న జరిగిన ఆది హిందూ ధార్మిక సభలో అంటరాని కులాల మధ్య సయోధ్యకు భాగ్యరెడ్డి పిలుపునిచ్చాడు.
భాగ్యరెడ్డి – ఆంధ్రమహాసభ
1930లో జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్రమహాసభ సమావేశంలో భాగ్యరెడ్డి వర్మ పాల్గొని అంటరానితనాన్ని విడనాడాలని ప్రతిపాదించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని ప్రసంగించాడు. 1934లో ఖమ్మంలో జరిగిన సమావేశాలకు పంపిన సందేశంలో సర్పాలను, చీమలను, జంతువులను ప్రేమించే అగ్రకులాలు అస్పృశ్యులను దూరంగా తొలగమంటారు. ఇది ఏమి న్యాయమని ప్రశ్నించడమేగాక, పురాణాలు, ఇతిహాసాల్లో ఖ్యాతినొందిన దళితుల ప్రస్తావనతో వారి ఔనత్యాన్ని చాటి చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో 1921 నుంచి 1924 వరకు ప్రాంతీయ ఆది హిందూ మహాసభలు జరిగాయి.
భాగ్యెరెడ్డి – గాంధీజీ
1917, డిసెంబర్ 15న కలకత్తాలో ఎన్జీ వెల్లింకర్ అధ్యక్షతన జరిగిన దివ్య జ్ఞాన సదస్సులో భాగ్యరెడ్డి వర్మ పాల్గొన్నారు. అదే సమయంలో కలకత్తాలో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుండగా అంటరాని వర్గాల చైతన్యంపై భాగ్యరెడ్డి వర్మ ప్రసంగించాలని ఆ సభ అధ్యక్షులు ప్రపుల్ల చంద్రరాయ్ ఆహ్వానించాడు. భాగ్యరెడ్డి ప్రసంగించేటప్పుడు గాంధీజీ ఆ సమావేశంలోనే ఉన్నారు. 1929, ఏప్రిల్‌లో గాంధీజీ హైదరాబాద్‌లో పర్యటించారు.
ఈ సమయంలో వర్మతో కలిసి ఆది హిందూ పాఠశాలలు, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ప్రాంగణాన్ని సందర్శించారు. భాగ్యరెడ్డి వర్మ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో గాంధీజీ పాల్గొని అంటరానితనాన్ని ఆచరించడం పాపం, హిందూ మతానికి మచ్చ అని హిందువులను హెచ్చరించాడు. వర్మ కృషి వల్ల గోవధను నిజాం ప్రభుత్వం నిషేధించినందుకు మహాత్మా గాంధీ నిజాం ప్రభుత్వాన్ని అభినందించారు.
స్థాపించిన సంస్థలు
- 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించారు. ఈ మండలిలో సహపంక్తి భోజనాలు, మాల జంగాలతో హరికథలు చెప్పించేవారు. జగన్ మిత్ర మండలిని 1911లో మన్య సంఘంగా స్థాపించారు. మన్య సంఘాన్ని 1922లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌గా మార్చాడు.
- జగన్ మిత్ర మండలికి అనుబంధంగా 1910లో వైదిక ధర్మ ప్రచారిణి సభ అనే ప్రచురణ సంస్థను స్థాపించి ఆది హిందువులు, ఇతరులను చైతన్యం చేయడానికి చిన్న పుస్తకాలను, కరపత్రాలను ముద్రించేవాడు.
- భాగ్యరెడ్డి వర్మ 1912లో స్వస్తిక్ దళ్ స్వచ్ఛంద ఆరోగ్య సేవాదళం ఏర్పాటు చేశారు.
- భాగ్యరెడ్డి వర్మ, రాయ్ బాలముకుంద్ ఆధ్వర్యంలో 1913లో హ్యూమానిటేరియన్ లీగ్‌ను ఏర్పాటు చేయగా, తర్వాత కాలంలో జీవరక్ష జ్ఙాన ప్రచార మండలిగా మారింది.
- 1914లో హైదరాబాద్‌లోని రెసిడెన్సీ బజార్ దగ్గర ఉన్న బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు.
- 1915లో విశ్వగృహ పరిచారిక సమ్మేళనాన్ని భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. ఈ సంఘం ఇంటివారి సమస్యల గురించి పనిచేసింది.
- 1915లో సంఘ సంస్కార నాటక మండలిని స్థాపించి హరిజనులతో నాటకాలు వేయించాడు.
- 1936లో భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించి విజ్ఙానాన్ని అందించాడు. 1937లో ఆది హిందూ మాసపత్రికగా మారింది.
- 1925లో భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులు రూపొందించిన చిత్ర పటాలు శిల్పాల ప్రదర్శన రెసిడెన్సీ బజార్లో నిర్వహించాడు. 1925లో హైదరాబాద్‌లో ప్లేగు, కలరా వ్యాధులు వ్యాపించినప్పుడు ఈ సంస్థల ద్వారా సేవలు చేశాడు. గాంధీజీ, సరోజినీ నాయుడు నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
- జీవదయ ప్రచార సభను స్థాపించి జంతుబలికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిలో భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.చిత్తరయ్య, బాలరామయ్య ముఖ్యులు.
- గ్రామాల్లో తన అనుచరుల ద్వారా న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేశాడు. న్యాయ పంచాయతీల తీర్పులపై అప్పీలు చేసుకోవడానికి తన నేతృత్వంలో కేంద్ర న్యాయ పంచాయతీని ఏర్పాటు చేశాడు.
సంవత్సరం అధ్యక్షులు
1921 పాపన్న
1922 వామన్ నాయక్
1923 కేశవరావు కోరాట్కర్
1924 రాజానాథన్ రాజ్గిరి
సంవత్సరం అధ్యక్షులు ప్రాంతం
1917 భాగ్యరెడ్డి వర్మ విజయవాడ
1919 భాగ్యరెడ్డి వర్మ మచిలీపట్నం
1920 భాగ్యరెడ్డి వర్మ గుడివాడ
1921 భాగ్యరెడ్డి వర్మ ఏలూరు
1925 భాగ్యరెడ్డి వర్మ అనంతపురం