- వెంటనే రద్దు చేసి న్యాయం చేయండి
- ఆర్డీవోను కలిసిన మజీద్ పూర్ బాధిత రైతులు
అబ్దుల్లాపూర్ మెట్,వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ భూములను ఇతర ప్రైవేట్ వ్యక్తులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు..? అని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్ పూర్ బాధిత రైతులు ప్రశ్నించారు. ఆ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. పలు సర్వే నంబర్లో 243.30 ఎకరాల భూమి ఉండగా.. 1993లో ఆనాటి ప్రభుత్వం 143 మంది పేద రైతులకు సీలింగ్ భూమిని పంపిణీ చేసి, సర్టిఫికెట్లు ఇచ్చి, పొజిషన్ చూపిందని గుర్తుచేశారు. ప్రస్తుతం 161, 162 సర్వే నంబర్లలో అందరికీ ఇచ్చిన విధంగా 18 ఎకరాలను17 మంది రైతులకు ఇచ్చారని, హక్కుదారు రైతులకు తెలియకుండా సీలింగ్ భూమిని అధికారులు మరొకరికి రిజిస్ట్రేషన్ చేశాని వివరించారు.
ఏడాది కిందట భూమిని కొనుగోలు చేసిన యజమానులు గోడ నిర్మిస్తుండగా అడ్డుకున్నామని రైతులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన కసరగొని లక్ష్మయ్య కుటుంబం రిజిస్ట్రేషన్ చేసిందని ప్రైవేట్ వ్యక్తులు చెప్పారని తెలిపారు. న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నామని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు, ఆధారాలను ఆర్డీవో అనంతరెడ్డి అందించారు. ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులతోపాటు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని, తమ భూమిని ఇప్పించాలని ఆర్డీవోను కోరారు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సీలింగ్ సర్టిఫికెట్లను పరిశీలించి, రిజిస్ట్రేషన్ పై విచారిస్తామని ఆర్డీవో తెలిపారు. మేడిపల్లి నర్సింహగౌడ్, జంగమయ్య, నగేశ్, సీలింగ్ భూమిని పొందిన రైతులు గోపగోని దర్శన్, ఎడ్ల రమేశ్, కావలి సాయి, గోపగోని బాలయ్య, శంకర్, బర్రె కృష్టయ్య తదితరులు ఉన్నారు.