- మరో 5.78 లక్షల టన్నుల నిల్వలు
- యాసంగి సాగు ఊపందుకోవడంతో భారీగా ఎరువుల వాడకం
హైదరాబాద్, వెలుగు : రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పంటల సాగును బట్టి డీఏపీ, యూరియా, పొటాష్, కాంప్లెక్స్, సింగిల్ సూపర్ పాస్ఫేట్ వంటి ఎరువులను సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10.82 లక్షల టన్నుల సరఫరా జరుగగా మరో 5.78 లక్షల టన్నులు ఎరువులు నిల్వ ఉన్నాయి. ఈ యాసంగిలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో గతేడాది కన్నా ఆయకట్టు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని, దీనికి సరిపడే ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
యాసంగిలో యూరియా వాడకం గణనీయంగా పెరిగింది. గత ఏడాది కన్నా ఎక్కువగా యూరియా వాడకం జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యూరియా మొత్తం డీఏవోల కంట్రోల్‌లోనే ఉండాలని క్షేత్రస్థాయి ఆఫీసర్లను అప్రమత్తం చేస్తున్నారు. ఎరువుల పంపిణీ విషయంలో డీఏవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని చెబుతున్నారు. ఈయేడు యాసంగి సాగు పనులు వేగం పుంజుకోవడంతో ఎరువుల వాడకం బాగా పెరిగింది. దీంతో బఫర్ స్టాక్ నిల్వలు తగ్గిపోతున్నాయి. రైతులకు మార్క్‌ఫెడ్, పీఏసీఎస్, ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువుల సరఫరా జరగుతోంది. ఇందులో ఎక్కువగా మార్క్‌ఫెడ్, పీఏసీఎస్సే సరఫరా చేస్తున్నాయి.
21 లక్షల టన్నుల ఎరువులు అవసరం
యాసంగి యాక్షన్ ప్లాన్‌లో 21 లక్షల టన్నుల వరకు ఎరువుల అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. యాక్షన్ ప్లాన్‌లో యూరియా 9.80 లక్షల టన్నులు, డీఏపీ 1.50 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 7 లక్షల టన్నులు, ఎంఓపీ ఎరువులు 70 వేల టన్నులు, ఎస్‌ఎస్‌పీ ఎరువులు 60 వేల టన్నులు.. ఇలా మొత్తం 19.60 లక్షల టన్నుల అంచనాలు ఉండగా మరో 1.40 లక్షల టన్నుల అదనపు అంచనాలతో కలిపి మొత్తం 21 లక్షల టన్నుల ఎరువులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్ పంపింది. ఎరువుల సరఫరాకు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించి ఎరువుల సరఫరా చేస్తోంది.
రాష్ట్రంలో 3.03 లక్షల టన్నుల యూరియా నిల్వలు
యాసంగి సీజన్‌లో 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయింపులు చేశారు. 6.84 లక్షల టన్నులు సరఫరా చేయాలని ప్లాన్ చేయగా.. ఇప్పటి వరకు 4.92 లక్షల టన్నుల యూరియా (72 శాతం) సప్లై జరిగింది. ఇంకా 1.92 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది. కోటా కేటాయింపుల్లో 28 శాతం యూరియా రావాల్సి ఉంది. మార్క్‌ఫెడ్ వద్ద యూరియా బఫర్ స్టాక్ కనీసం 3 లక్షల టన్నులు ఉండాలి.
కానీ.. ఇటీవల యూరియా అమ్మకాలు గణనీయంగా పెరగడంతో స్టాక్‌లో చాలా వరకు నిల్వలను క్షేత్రస్థాయికి పంపి రైతులకు అందించారు. ప్రస్తుతం 1.72 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. డీలర్ల వద్ద 91 వేల టన్నులు, సొసైటీల వద్ద 40 వేల టన్నులు ఇలా మొత్తం 3.03 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడించాయి.
ఎరువుల స్టాక్ 5.78 లక్షల టన్నులు
రాష్ట్రవ్యాప్తంగా ఎరువులన్నీ కలిపి మొత్తం 5.78 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. డీలర్ల వద్ద 2.73 లక్షల టన్నులు ఉండగా, సొసైటీల దగ్గర 69 వేల టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 1.79 లక్షల టన్నుల ఎరువులు ఉన్నాయి. కంపెనీల గోదాముల వద్ద 56 వేల టన్నులు ఉండగా అన్నీ కలిపి మొత్తం 5.78 లక్షల టన్నుల ఎరువుల స్టాక్ ఉంది. సీజన్ అవసరాలను బట్టి కేంద్రం నుంచి నెలనెలా రావాల్సిన ఎరువులను ఎప్పటికప్పడు తెప్పిస్తూ రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఎరువుల సరఫరాలో రైతులకు ఇబ్బందులు రావద్దు
ఎరువుల సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై వ్యవసాయశాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే నెల వరకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.
యూరియా, ఎరువులను పీఏసీఎస్‌లు, ఆగ్రోస్రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వ్యవసాయశాఖ డీసీవోలు, మార్క్‌ఫెడ్ డీఎంలు, డీఏవోలు సమన్వయంతో పనిచేయాలని, పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ధాన్యం నిల్వల్లో మోడ్రన్ టెక్నాలజీ వాడాలి
గోడౌన్లను అభివృద్ధి చేసి, ధాన్యం నిల్వల్లో మోడ్రన్ టెక్నాలజీ వినియోగించాలని మంత్రి తుమ్మల సూచించారు. స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఏడాది కాలంగా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆహార ధాన్యాల నిల్వలో టెక్నాలజీ వినియోగిస్తే నాణ్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని చెప్పారు.