రాష్ట్రవ్యాప్తంగా 165 ఎకరాల్లో ప్రయోగం
కామారెడ్డి, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్లో వరికి బదులు పత్తి సాగు పెంచేందుకు వ్యవసాయ శాఖ ట్రయల్స్వేస్తోంది. యాసంగిలో పత్తి పంట వేస్తే వచ్చే సమస్యలు, దిగుబడులపై క్షేత్రస్థాయి ఫలితాలు తెలుసుకొనేందుకు ప్రయోగాత్మక సాగు మొదలుపెట్టింది. అందుకోసం ఆయా జిల్లాల్లోని విత్తనోత్పత్తి క్షేత్రాల్లో
( సీడ్ ఫామ్స్) అధికారులు పత్తి సాగు చేస్తున్నారు. ఈ పంటపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.
విత్తన క్షేత్రాల్లో ప్రయోగాలు
యాసంగిలో 200 ఎకరాల్లో పత్తి పంట వేసి పరీక్షించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలందాయి. దీంతో ఆయా జిల్లాల్లోని సీడ్ ఫామ్స్‌లో జనవరి నుంచి పత్తి సాగు షురూ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని 4 విత్తనోత్పత్తి క్షేత్రాల్లో 165 ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో 60 ఎకరాలు, నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లిలో 50 ఎకరాలు, ఉమ్మడి నల్గొండ జిల్లా డిండి, చెరకుపల్లిలో 45 ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. ప్రయోగాత్మక పరిశీలనకు, రైతుల అవగాహనకు ఇది ఉపయోగపడుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో పత్తి మొలకలు వచ్చాయి. విడతల వారీగా తడులు అందిస్తున్నారు.
వరిని తగ్గించేందుకు..
ప్రతి సీజన్ లో రాష్ట్రంలో రైతులంతా ఎక్కువగా వరిని పండిస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అందుకు వరి సాగు తగ్గించి, పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. దిగుబడి పరిశీలన, వాతావరణ పరిస్థితులు, నీటి తడులు, తెగుళ్ల వ్యాప్తి ఆంశాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. వానాకాలంలో ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, 4 నుంచి 5 నెలల వరకు టైం పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. యాసంగిలో ఎంత దిగుబడి వస్తుందో పరిశీలించనున్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే రానున్న రోజుల్లో యాసంగిలోనూ రైతులు పత్తి వేసుకొనేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.