హమ్మయ్య.. ఆ పైలట్ నిజంగా దేవుడే.. ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్.. 141 మంది సేఫ్..

హమ్మయ్య.. ఆ పైలట్ నిజంగా దేవుడే.. ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్.. 141 మంది సేఫ్..

తిరుచ్చి: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX 613 తిరుచ్చి విమానాశ్రయంలో సేఫ్గా ల్యాండ్ అయింది. దీంతో ఆ విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జా వెళ్లాల్సిన విమానం శుక్రవారం సాయంత్రం (అక్టోబర్ 10, 2024) టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొంతసేపటికే విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కారణంగా సమస్య తలెత్తింది.

 

హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్యను గ్రహించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. బెల్లీ ల్యాండింగ్ చేస్తే విమానం పల్టీలు కొట్టే ప్రమాదం ఉందని అధికారులు పైలట్కు చెప్పారు. విమానంలో ఇంధనం వీలైనంత తక్కువగా ఉన్నప్పుడే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు సాధ్యం అవుతుందని పైలట్స్కు అధికారులు సమాచారం అందించారు.

 

విమానంలో ఇంధనాన్ని తగ్గించేందుకు దాదాపు 2 గంటల పాటు ఆ ఫ్లైట్ గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ పరిణామంతో తిరుచ్చి విమానాశ్రయం అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గోపాల కృష్ణన్ ఆదేశాలతో 20 అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాయి. వైద్య సిబ్బంది చేరుకున్నారు. విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులు దేవుడి పైనే భారం వేశారు. 

సోషల్ మీడియాలో #Trichy, #AirIndia, IX 613 హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. విమానంలో ఉన్న ఎవరికీ ఏం కాకూడదని, ఫ్లైట్ సేఫ్గా ల్యాండ్ అవ్వాలని అంతా ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలించాయి.  పైలట్ చాకచక్యంతో విమానం సురక్షితంగా తిరుచ్చి విమానాశ్రయం రన్వేపై ల్యాండ్ అయింది. ఆ 141 మంది ప్రయాణికుల పాలిట ఆ పైలట్ ఇప్పుడు దేవుడయ్యారు. సోషల్ మీడియాలో సదరు పైలట్ను దేవుడిగా కీర్తిస్తూ పోస్టులు కనిపిస్తున్నాయి.