కంప్యూటర్ సైన్స్ సీట్లన్నీ నిండినయ్

కంప్యూటర్ సైన్స్ సీట్లన్నీ నిండినయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీఎస్​ఎంసెట్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధించిన సీట్లన్నీ దాదాపు నిండగా, సివిల్, మెకానికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ ఫస్టియర్​లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్​ లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు 76,821 మంది అటెండ్ అయ్యారు. వీళ్లలో 75,708 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 82,666 కన్వీనర్ కోటా సీట్లుండగా, వాటిలో 70,665 సీట్లు ఫస్ట్ ఫేజ్ లో అలాట్ చేశారు. ఇంకా 12,001 సీట్లు మిగిలాయి. సర్కారు కాలేజీలు 16 ఉండగా వాటిలో  5,176 సీట్లకుగాను 4,406 సీట్లు నిండాయి. 155 ప్రైవేటు కాలేజీల్లో 75,993 సీట్లుంటే 65,135 సీట్లు విద్యార్థులకు అలాట్ అయ్యాయి. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,124 సీట్లు అలాట్ చేశారు. కాగా, 5,043 మంది ఆప్షన్లు తక్కువగా పెట్టుకోవడంతో, వారికి సీట్లు అలాట్ కాలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 33 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు నిండగా, దాంట్లో 3 సర్కారు వర్సిటీ కాలేజీలు, 28 ప్రైవేటు కాలేజీలున్నాయి. ఈ నెల 22లోగా ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోని సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడగా, సాంప్రదాయ కోర్సులుగా ఉన్న సివిల్, మెకానికల్ తదితర కోర్సులకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ విద్యాసంవత్సరం కాలేజీ మేనేజ్మెంట్లు కూడా సాంప్రదాయ కోర్సుల సీట్లను భారీగా తగ్గించుకున్నాయి. 

 

ALSO READ :నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు.. పలు యూనివర్సిటీల సర్టిఫికెట్లు స్వాధీనం

కంప్యూటర్ సైన్స్ లో 94.20% సీట్లు కేటాయించిన్రు 

కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సులకు సంబంధించి ఈసారి ప్రభుత్వం భారీగా కొత్త సీట్లకు పర్మిషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే సీట్ల అలాట్మెంట్ కొనసాగింది. సీఎస్​ఈ, ఐటీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర 18 కోర్సుల్లో 55,876 సీట్లుంటే, దాంట్లో 52,637 (94.20%) సీట్లు నిండాయి. 3,239 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 23,467 సీట్లకుగాను 23,162 సీట్లు అలాట్ చేశారు. అయితే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కేటగిరిలోని 8 బ్రాంచులలో 17,274 సీట్లుంటే.. 13,595 (78.70%) సీట్లు కేటాయించారు. మరో 3,679 సీట్లు మిగిలిపోయాయి. సివిల్, మెకానికల్ అనుబంధ కోర్సుల్లో 8,261 సీట్లకుగాను 3,642 (44.09%) సీట్లు విద్యార్థులకు అలాట్ చేశారు. ఇంకా 4,619 సీట్లు మిగిలాయి. ఇతర పలు ఇంజినీరింగ్ కేటగిరీ కోర్సుల్లో 1,255 సీట్లకు 791 సీట్లు నిండాయి. అయితే, సివిల్, మెకానికల్  కోర్సుల్లో భారీగా సీట్లు తగ్గినప్పటికీ వాటిల్లో సగం కూడా నిండలేదు.